చంద్రబాబు అరెస్ట్​ వెనుక మోదీ, కేసీఆర్: మధుయాష్కీ గౌడ్

చంద్రబాబు అరెస్ట్​ వెనుక మోదీ, కేసీఆర్: మధుయాష్కీ గౌడ్
  •     బెయిల్ రాకుండా కుట్ర: మధుయాష్కీ గౌడ్
  •     చంద్రబాబు అరెస్ట్​పై కేసీఆర్ మాట్లాడాలి
  •     వంద రోజుల్లో బీఆర్ఎస్ ఖతమైతదని కామెంట్

ఎల్బీనగర్, వెలుగు : చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. ఏపీలో జగన్​ను గెలిపించేందుకు కేసీఆర్ వందల కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎవరు నేరం చేసినా.. చట్టం వారిని శిక్షిస్తుందన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని చైతన్యపురిలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీమ్​లను పార్టీ సీనియర్ లీడర్ మల్లు రవితో కలిసి ఇంటింటికెళ్లి వివరించారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడారు. 

చంద్రబాబు అరెస్ట్​పై స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతులు కట్టుకొని ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు. సీఎం మాత్రం నోరు మెదపడం లేదన్నారు. చంద్రబాబు అరెస్ట్​పై కేసీఆర్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా నుంచి వచ్చి ఎల్బీనగర్​ సెగ్మెంట్​లో నివాసం ఉంటున్న అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముళ్ల ఓట్ల కోసం సుధీర్ రెడ్డి నాటకాలాడుతున్నారని విమర్శించారు. 

బీఆర్ఎస్ పార్టీవి డెమో పథకాలే అని, ఏ స్కీమ్ కూడా పూర్తి స్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించిన దాఖలాల్లేవన్నారు. పార్టీ కార్యకర్తలకే దళితబంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారన్నారు. బీఆర్ఎస్ పథకాలన్నీ హామీలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక డెమో సర్కార్ అని ఎద్దేవా చేశారు. 

బీఆర్ఎస్ వారెంటీ ఖతమైంది

టీఆర్ఎస్ పార్టీకి వారెంటీ ఖతమైందని, అందుకే బీఆర్ఎస్ పేరుతో ముందుకొచ్చిందని, ఇక బీఆర్ఎస్​కి కూడా ఓ గ్యారెంటీ, వారెంటీ లేదని మధుయాష్కీ గౌడ్, మల్లు రవి అన్నారు. రాబంధుల సమితి పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. రానున్న వంద రోజుల్లో బీఆర్ఎస్ ఖతమవుతుందని, తర్వాత వచ్చే వంద రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకొచ్చి గ్యారెంటీలు అమలు చేస్తుందని అన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని, గ్యారెంటీలు చూసి మతిభ్రమించి బీఆర్ఎస్ లీడర్లు ఆమెపైనే కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీ అంటేనే.. నిబద్ధత, నిజాయితీ గల పార్టీ అని అన్నారు. తెలంగాణ ఇచ్చినట్లే.. గ్యారెంటీలు కూడా అమలు చేసి తీరుతామని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాల్జేశారని ఆరోపించారు. లబ్బర్ చెప్పులు వేసుకుని.. డబ్బా పట్టుకుని తిరిగే హరీశ్​రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే హరీశ్​పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ లీడర్లు మల్రెడ్డి రామ్ రెడ్డి, కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.