భారీ వర్షాలతో అల్లకల్లోలమైపోయిన రెండు తెలుగు రాష్ట్రాలను ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. సహాయ చర్యల్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలు అండగా ఉంటుందని చెప్పారు. భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణల్లో ఏర్పడిన పరిస్థితులపై ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో బుధవారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గురించి ఇద్దరు సీఎంలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాలు ఈ కష్టం నుంచి బయటపడేందుకు అన్ని రకాలుగా సాయం చేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని మోడీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన కష్టం నుంచి తేరుకునేందుకు అన్ని రకాలుగా కేంద్రం ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ భారీ వర్షాల కారణంగా ఇబ్బందులకు గురైన వారికి ఆయన సానుభూతి తెలిపారు.
Spoke to @TelanganaCMO KCR Garu and AP CM @ysjagan Garu regarding the situation in Telangana and AP respectively due to heavy rainfall. Assured all possible support and assistance from the Centre in rescue & relief work. My thoughts are with those affected due to the heavy rains.
— Narendra Modi (@narendramodi) October 14, 2020
దేశమంతా తెలంగాణకు అండగా ఉంటుంది
తెలంగాణలో భారీ వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడి.. వివరాలు తెలుసుకున్నారు. ఈ కష్ట సమయంలో దేశమంతా తెలంగాణ అండగా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన సంతాపం తెలిపారు.
Spoke with the Governor of Telangana, @DrTamilisaiGuv and CM Shri K. Chandrashekar Rao and expressed concern over loss of lives & destruction caused by incessant rain in Hyderabad & parts of Telangana. In this hour of crisis, the nation stands united with the people of Telangana.
— President of India (@rashtrapatibhvn) October 14, 2020
బంగాళాఖాతం ఏర్పడిన వాయుగుండం కారణంగా గడిచిన రెండు మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఏపీ అల్లకల్లోలమైపోయాయి. సోమవారమంతా ఎడతెరిపిలేకుండా కురిసిన వానకు హైదరాబాద్ సిటీ అంతా జలమయమైపోయింది. రోడ్లన్నీ వాగుల్లా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చెరువులు, వాగులకు గండ్లు పడ్డాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే భారీ వర్షాలకు ఇల్లు, గోడలు కూలి 10 మందికి పైగా మరణించారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రలో భారీ ఆస్తి, పంట నష్టం జరిగింది.
