మణిపూర్ మండిపోతుంటే  మీకు నవ్వెట్లా వస్తోంది?  : రాహుల్ గాంధీ

మణిపూర్ మండిపోతుంటే  మీకు నవ్వెట్లా వస్తోంది?  : రాహుల్ గాంధీ
  • ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్ 
  • ప్రధాని ప్రసంగం ‘ఫన్’లా సాగింది 
  • మణిపూర్ ను, అక్కడి మహిళలను ఎగతాళి చేశారు 
  • కావాలనే రాష్ట్రంలో హింసను ఆపడం లేదని కామెంట్ 

న్యూఢిల్లీ:  ఓవైపు మణిపూర్ మండిపోతుంటే.. మరోవైపు ప్రధాని మోదీ పార్లమెంట్ లో నవ్వుతూ, జోకులు వేశారని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధాని మాట్లాడిన తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. ఒక ప్రధాని అలా మాట్లాడడం కరెక్టు కాదన్నారు. సభలో రెండు గంటలూ కాంగ్రెస్, ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూనే ప్రధాని ప్రసంగం సాగిందని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని నిన్న లోక్ సభలో రెండు గంటలు మాట్లాడారు. ఆ రెండు గంటలూ నవ్వుతూ, జోకులు వేశారు. నినాదాలు చేశారు. నాలుగు నెలలుగా మణిపూర్ మండిపోతోందని ప్రధాని మర్చిపోయినట్టు ఉన్నారు” అని రాహుల్ అన్నారు. దేశంలో హింసాత్మక ఘటనలు జరుగుతుంటే, వాటిపై మాట్లాడకుండా.. ప్రధాని రెండు గంటలు ఫన్ చేశారని విమర్శించారు. మణిపూర్ ను, అక్కడి మహిళలను మోదీ ఎగతాళి చేశారని మండిపడ్డారు. ‘‘మణిపూర్​లో మహిళలు, చిన్న పిల్లలు చనిపోతున్నారు. మహిళలను రేప్ చేస్తున్నారు. లైంగికంగా వేధిస్తున్నారు. కానీ మన ప్రధాని మాత్రం ఇదంతా చూస్తూ.. పార్లమెంట్​లో కూర్చుని నవ్వుతున్నారు. ఇది రాహుల్ గాంధీకో, కాంగ్రెస్ కో, ప్రతిపక్షాలకో సంబంధించిన విషయం కాదు. ఇది మన దేశానికి సంబంధించిన విషయం” అని అన్నారు. 
 
ఇది భరతమాతకే అవమానం.. 

‘మణిపూర్​లో భరతమాతను చంపేశారు’ అన్న మాటల్లో తప్పేముంది? అని రాహుల్ ప్రశ్నించారు. ‘‘మేం మణిపూర్​లో మైతీ వర్గ ప్రజల ఏరియాకు వెళ్లాలని అనుకున్నప్పుడు..  వాళ్లు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు. కానీ మా సెక్యూరిటీలో కుకీ వర్గానికి చెందినోళ్లు ఎవరూ ఉండొద్దన్నారు. ఒకవేళ ఉంటే చంపేస్తామన్నారు. అలాగే మేం కుకీ ప్రజల ఏరియాకు వెళ్తున్నప్పుడు.. మా వెంట మైతీ వర్గ ప్రజలు ఎవరూ ఉండొద్దన్నారు. ఇండియా అంటేనే అందరం కలిసిమెలిసి జీవించడం. కానీ మణిపూర్​లో అది లేకుండా పోయింది. అందుకే నేను ‘మణిపూర్​లో భరతమాతను హత్య చేశారు’ అని అన్నాను. ఇది నిజం.. ఇందులో తప్పేముంది?” అని ప్రశ్నించారు. కానీ పార్లమెంట్ లో తాను మాట్లాడింది తప్పు అంటూ.. భరతమాత పదాన్ని తొలగించారని చెప్పారు. పార్లమెంట్​లో తొలిసారి భరతమాత పదాన్ని తొలగించారని, ఇది భరతమాతను అవమానించడమేనని అన్నారు.

ప్రధాని చిల్లర రాజకీయాలు చేయొద్దు.. 

మణిపూర్ మొత్తం నాశనమైందని, బీజేపీ రాజకీయాల వల్లే ఇదంతా జరిగిందని రాహుల్ ఆరోపించారు. మణిపూర్ లో హింసను ఆపేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆపడం లేదని మండిపడ్డారు. ఆర్మీని రంగంలోకి దించితే, రెండ్రోజుల్లోనే అక్కడ పరిస్థితి అదుపులోకి వస్తుందని చెప్పారు. ‘‘మణిపూర్ లో హింసను ఆపాలని అనుకుంటే వెంటనే ఆపొచ్చు. కానీ మోదీ అలా అనుకోవడం లేదు. ఆయన మణిపూర్ మండిపోవాలని కోరుకుంటున్నారు” అని ఆరోపించారు. మోదీ మణిపూర్ వెళ్లకపోవడానికి కారణాలు ఉన్నాయని, అయితే అవి తాను పబ్లిక్ గా చెప్పాలనుకోవడం లేదని అన్నారు. ‘‘ఒక ప్రధాని చిల్లర రాజకీయాలు చేయొద్దు. ప్రధాని రాజకీయాలను పక్కన పెట్టాలి. ప్రజల ప్రతినిధిగా మాట్లాడాలి. కానీ మోదీని చూస్తే బాధగా ఉంది. అసలు ప్రధానికి ఆయనేంటో అర్థం కావడం లేదు. నేను కాంగ్రెస్, బీజేపీ ప్రధానులను చూశాను. వాజ్ పేయి, దేవెగౌడను చూశాను. కానీ వాళ్లెవరూ ఇలా చేయలేదు” అని అన్నారు.