నిలకడగా ములాయం సింగ్ ఆరోగ్యం

నిలకడగా ములాయం సింగ్ ఆరోగ్యం

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు ఫోన్ చేసి ఆయన తండ్రి హెల్త్ కండీషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అఖిలేష్ యాదవ్‌తో ఫోన్ లో మాట్లాడారు. ఆసుపత్రిలోని వైద్యులు ములాయం సింగ్ కు మెరుగైన వైద్యం అందించాలని కోరినట్లు యూపీ ప్రభుత్వ వర్గాలు  తెలిపాయి. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ములాయం త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అఖిలేష్ యాదవ్‌కు ఫోన్ చేసి ఆయన తండ్రి ఆరోగ్యంపై ఆరా తీశారు. ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే తాను అతని కుమారుడు అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఆయన తర్వగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. 

తొలుత ప్రైవేట్ వార్డులో చేరిన ములాయం సింగ్ యాదవ్ ను ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో వెంటనే ఐసీయూ వార్డుకు తరలించారు. 82 ఏళ్ల ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అనారోగ్య కారణంతో కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అయితే ఆదివారం ఆయన పరిస్థితి క్షీణించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు మార్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.