ఢిల్లీలోని భారత్ మండపం మరోసారి ప్రపంచ వేదికగా మారింది. జీ-20 సదస్సు తర్వాత అంతటి స్థాయిలో.. అంతర్జాతీయ దిగ్గజాల సమక్షంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా పీఎం మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రపంచాన్ని ఏఐ చర్చల కోసం ఏకం చేస్తున్నాం. ఏఐ మార్పులో భారత్ ముందంజలో ఉంది. ఈ సాంకేతికతను మానవ శ్రేయస్సు కోసం, బాధ్యతాయుతంగా ఉపయోగించడమే మన లక్ష్యం అంటూ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
గ్లోబల్ సౌత్ దేశాల్లో ఇదే తొలిసారి..
బ్రిటన్, సౌత్ కొరియా, ఫ్రాన్స్ తర్వాత జరుగుతున్న నాలుగో ఏఐ సదస్సుకు ప్రస్తుతం ఇండియా వేదికగా మారింది. అయితే ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో సమ్మిట్ జరగడం ఇదే మొదటిసారి. ఈ సదస్సు కోసం దాదాపు 100 దేశాల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు.
హాజరవుతున్న ప్రపంచ నేతలు..
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా ద సిల్వా, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వంటి వ్యక్తులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. శ్రీలంక, మారిషస్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ దేశాల అధినేతలు కూడా ఢిల్లీలోని సమ్మిట్ కార్యక్రమానికి హాజరౌతున్నారు.
దిగ్గజ టెక్ సీఈఓల సందడి..
సాంకేతిక ప్రపంచంలో తిరుగులేని నాయకులుగా ఉన్న గూగుల్ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సామ్ ఆల్ట్‌మాన్, బిల్ గేట్స్ వంటి వారు ఈ సదస్సుకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు భారతీయ ఇండస్ట్రియలిస్టులు ముఖేష్ అంబానీ, ఎన్. చంద్రశేఖరన్, సలీల్ పరేఖ్, శ్రీధర్ వెంబు సహా 40 మందికి పైగా సీఈఓలు ఈ వేదికపై ఏఐ భవిష్యత్తు గురించి తమ ఆలోచనలను పంచుకోబోతున్నారు.
5 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి మెుత్తం 2.5 లక్షల మందికి పైగా వస్తారని అంచనా. సదస్సులో 500కి పైగా సెషన్లలో 3వేల మందికి పైగా గెస్ట్స్ ప్రసంగిస్తారు. అలాగే 500 స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి. అందరి సంక్షేమం, అందరి సంతోషం కోసం ఏఐ వినియోగం అనే అంశం కేంద్రంగానే సదస్సు కొనసాగనుంది. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే మూడు అంశాల ఆధారంగా ప్రదర్శనలు ఉంటాయి.
ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026..
సమ్మిట్ తో పాటే 'ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో'ను ప్రధాని ప్రారంభించారు. ఇందులో ఎన్విడియా, గూగుల్, ఓపెన్ ఏఐ వంటి గ్లోబల్ కంపెనీలతో పాటు 400 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఇది భారతీయ స్టార్టప్ కంపెనీలకు.. గ్లోబల్ కంపెనీలకు మధ్య ఒక వారధిలా పనిచేస్తుందని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఏఐ అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాకుండా అది అందరికీ అందుబాటులో ఉండేలా, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలన్నదే తాజా సమ్మిట్ ద్వారా ప్రపంచానికి భారత్ పంపిస్తున్న మెసేజ్.
