న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్ కార్యక్రమంలో కాల్పుల ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేసిన మోడీ.. వాషింగ్టన్ డీసీలోని ఒక హోటల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, జేడీ వాన్స్ క్షేమంగా ఉన్నట్లు తెలిసి ఊరట చెందానని పేర్కొన్నారు. వారు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని.. హింసను నిస్సందేహంగా ఖండించాలని పిలుపునిచ్చారు.
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్లో కాల్పులు
వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్కు ప్రెసిడెంట్ ట్రంప్ డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ట్రంప్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సహా సుమారు 2,600 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిన్నర్ మీట్ కొనసాగుతుండగా ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్ధం తీవ్ర కలకలం రేపింది.
వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్‌ను అత్యవసరంగా హోటల్ నుంచి బయటకు తరలించారు. కాల్పుల శబ్ధంతో భయాందోళనకు గురైన గెస్ట్‌లు టేబుళ్ల కింద దాక్కుకున్నారు. ఘటన స్థలంలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా దళాలు హోటల్‌ను ఆధీనంలోకి తీసుకున్నాయి.
కాల్పులు జరిపిన నిందితుడిని సెక్యూరిటీ ఫోర్సెస్ చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడు 5 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిగినట్టు గుర్తించారు. ట్రంప్ సహా కీలక నేతలు అంతా సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.

