
- కరప్షన్ ఏటీఎం పెట్టి ఆ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసింది: మోదీ
- రిజర్వేషన్లు, హక్కుల రక్షణ కోసం నేను ప్రజలకు చౌకీదార్‌లా ఉంటా
- బీజేపీ వచ్చాకే దేశంలో బాంబు బ్లాస్ట్‌లు ఆగాయి
- జూన్ 4న దేశం గెలుస్తుంది.. 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుంది
- రాష్ట్రంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ జిరాక్స్ కాపీలా మారింది
- కాళేశ్వరంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పెన్ను కూడా కదిలిస్తలేదు
- నారాయణపేట, హైదరాబాద్ సభలో ప్రధాని ప్రసంగం
హైదరాబాద్/ మహబూబ్‌నగర్/ నారాయణపేట, వెలుగు : పదేండ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఇచ్చిందని, కానీ ఆ డబ్బును బీఆర్ఎస్ పార్టీ తన జేబులో వేసుకున్నదని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కరప్షన్ ఏటీఎం పెట్టి పైసలను లూటీ చేసిందని చెప్పారు. బీజేపీ వచ్చాకే దేశంలో బాంబు బ్లాస్ట్‌లు ఆగిపోయాయని అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట సభతోపాటు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ భాగ్యనగర్ జనసభలో మోదీ మాట్లాడారు. ‘‘పదేండ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణకు కేంద్రం నుంచి లక్షల కోట్లు అందించాం. కానీ, ఈ పైసలు ఎక్కడికి వెళ్లాయి? బీఆర్ఎస్ కరప్షన్ ఏటీఎం పెట్టి ఈ డబ్బులను తన జేబులో వేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేయాలని చూస్తోంది. తెలంగాణను లూటీ చేయాలని అనుకుంటోంది' అని మోదీ పేర్కొన్నారు.
ఆర్ఆర్ ట్యాక్స్‌లో నేనెవరి పేరు చెప్పలే
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని మోదీ అన్నారు. అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్పదేండ్లలో ఎంత లూటీ చేసిందో, కాంగ్రెస్ కొన్ని నెల్లలో ఇది చేయాలని చూస్తోందని చెప్పారు. ఎన్నికలప్పుడు పరిశ్రమల గురించి చెప్పి, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఫేక్ వీడియోల పరిశ్రమను ఏర్పాటు చేసిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరంపై జరిగిన అవినీతి విషయంలో కాంగ్రెస్ పెన్ను కూడా కదల్చడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డబుల్ ఆర్ట్యాక్స్పడుతోందని, ఈ విషయంపై ఢిల్లీలో కూడా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. తాను డబుల్ఆర్ట్యాక్స్ విషయంలో ఎవరి పేరు చెప్పలేదని, కానీ, తెలంగాణ సీఎం మాత్రం మీడియాతో ఈ విషయంపై అవాకులు, చవాకులు చెబుతున్నారని అన్నారు. దీన్ని బట్టి డబుల్ఆర్ట్యాక్స్ ఎవరి జేబులోకి వెళ్తుందో అర్థం చేసుకోవాలని తెలిపారు. తెలంగాణలో ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ కూడా నడుస్తోందని.. ఇంకో ఆర్ అంటే రజాకార్ ట్యాక్స్అని పేర్కొన్నారు. రజాకార్ ట్యాక్స్ ఎలా ఉంటుందో పాతబస్తీకి వెళ్తే తెలుస్తుందని చెప్పారు.
రైతులకు నమ్మక ద్రోహం
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు వారి స్వార్థం కోసం ఇక్కడి ప్రజలను వాడుకుంటున్నారని మోదీ అన్నారు. ‘‘2009లో మహబూబ్‌నగర్ ఎంపీగా ఇక్కడి ప్రజలు కేసీఆర్‌ను గెలిపించి పార్లమెంట్‌కు పంపారు. తెలంగాణ వచ్చాక ఆయన ఈ జిల్లాను మరిచిపోయారు. కొత్తగా వచ్చిన సీఎం ఇక్కడి వాడే. ఆయన కూడా ఢిల్లీ హైకమాండ్ ముందు ఖుషామతి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లకు లెక్కాత్రాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ పరిస్థితిని మార్చాలి. ఇందుకు బీజేపీ ఎంపీలను అత్యధిక సంఖ్యలో ఎన్నుకొని ఢిల్లీకి పంపాలి”అని మోదీ కోరారు. ‘‘పాలమూరుకు కృష్ణా, తుంగభద్ర నదుల ఆశీర్వాదం ఉంది. కానీ ఇక్కడి రైతులు దినసరి కూలి కోసం వలస పోవాల్సి వస్తోంది. ఇక్కడి ప్రాజెక్టుల కోసం లక్షల కోట్లు ఇచ్చినా కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్లడం లేదు. రైతులకు రుణమాఫీ చేస్తామని అబద్ధాలు చెప్పింది. నమ్మక ద్రోహం చేసింది’’ అని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోయాయని, ఈ సీటును గెలుచుకునేందుకు ఎలాంటి ఆటలాడుతున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. డీకే అరుణ ఆడ బిడ్డ అని, ఆమెకు వ్యతిరేకంగా సీఎం అవమానకరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓట్లతో కాంగ్రెస్‌కు జవాబు చెప్పాలని మోదీ పిలుపునిచ్చారు.
ఎన్నికలప్పుడే రాకుమారుడి ప్రేమ దుకాణం..
కాంగ్రెస్‌లో ఒక రాకుమారుడు (రాహుల్‌గాంధీ) ఉన్నారని, ఎన్నికలకు ముందు ఆయనకు ప్రేమ దుకాణం గుర్తొస్తుందని మోదీ అన్నారు. ‘ఈ రాకుమారుడికి రాజగురువు ఉన్నాడు. ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన దక్షిణ భారత్‌లో ఉండే వారిని ఆఫ్రికన్లు అన్నాడు. తెలంగాణ ప్రజలు ఆయనకు ఆఫ్రికన్లలా కనిపిస్తున్నారా?” అని శ్యాంపిట్రోడా వ్యాఖ్యలనుద్దేశించి మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మానసికంగా హిందూ వ్యతిరేకి అని, హిందువులన్నా.. హిందూ పండుగలన్నా ద్వేషం అని పేర్కొన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగం పరంగా వ్యతిరేకమని, దీన్ని అంబేద్కర్ కూడా వ్యతిరేకించారని చెప్పారు. కాంగ్రెస్ ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో వెనుకడుగు వేయడం లేదని, ఇదే ఆ పార్టీ అసలైన ఎజెండా అని పేర్కొన్నారు.
తెలంగాణలో ఎక్కడికెళ్లినా బీజేపీ పేరే
తెలంగాణలో ఎక్కడకు వెళ్లినా బీజేపీ పేరే వినిపిస్తోందని మోదీ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్. మజ్లిస్ వద్దని, బీజేపీకి మాత్రమే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారని మోదీ తెలిపారు. జూన్ 4న దేశం, 140 కోట్లమంది ప్రజల సంకల్పం గెలుస్తుందని వ్యాఖ్యానించారు.
మోదీలేని భారతాన్ని చూడలేం: కిషన్ రెడ్డి
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ లేని భారతాన్ని మనం చూడలేమని అన్నారు. కాగా, సభకు ఆలస్యంగా రావడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ ను స్టేజిపైకి ఎస్పీజీ అధికారులు అనుమతించలేదు. దీంతో ఆయన జనాల మధ్యలో ఉండి మోదీ ప్రసంగం విన్నారు. ఈ సభలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు, రాంచందర్ రావు, చింతల రాంచంద్రారెడ్డి, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, ప్రకాశ్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ వచ్చాకే బాంబు బ్లాస్ట్‌లు ఆగినయ్
కాంగ్రెస్ హయాంలో దిల్‌సుఖ్ నగర్ వరుస బాంబు పేలుళ్లు అందరికీ గుర్తున్నాయని, దేశమంతా ఇలాంటి వార్తలు వచ్చేవని, ఢిల్లీలో బలమైన ప్రభుత్వం (బీజేపీ) వచ్చాకే బాంబు బ్లాస్ట్‌లు ఆగిపోయాయని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి, వారి కూటమికి ఇది ఇష్టం లేదని, అందుకే మోదీని తొలగించాలని చాలామంది కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. దేశం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకూడదన్నారు. మీ సంపదను లాక్కునే వారు కావాలా? మీ సంపదను కాపాడేవారు కావాలా? ఎంచుకోవాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హైదరాబాద్ విముక్తి దినోత్సవాన్ని నిర్వహించలేదని, తాము ప్రతి సెప్టెంబర్ 17న హైదరాబాద్ ముక్తి దివస్ నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణకు ఎయిమ్స్, 4 వందే భారత్ రైళ్లు, ట్రైబల్ యూనివర్సిటీ, ఫర్టిలైజర్ ఇండస్ట్రీ, పసుపుబోర్డు, ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఇవన్నీ బీజేపీ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే కాంగ్రెస్‌కే మద్దతు పలుకుతుందని, కాంగ్రెస్‌కు ఓటేస్తే కేంద్రంలో ప్రభుత్వం రాదని, అందుకే కమలం గుర్తుపై ఓటేయాలని కోరారు.