- టీఎంసీకి బుజ్జగింపు రాజకీయాలే ముఖ్యం: ప్రధాని మోదీ
- పూర్బ మేదినీపూర్ జిల్లా హల్దియాలో ఎన్నికల ప్రచారం
- మమత సర్కార్ పై 'ఆరు గ్యారెంటీల' అస్త్రం
- 7వ పే కమిషన్ అమలు, చొరబాటుదారుల బహిష్కరణే లక్ష్యమని వెల్లడి
- తృణమూల్ సిండికేట్ పాలనకు చరమగీతం పాడుతామని వ్యాఖ్య
కోల్‌కతా: బెంగాల్ ప్రజల సొమ్మును దోచుకున్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. బెంగాల్‌ను లూటీ చేసినోళ్ల లెక్క తేలుస్తాం (సబ్కా హిసాబ్ హోగా) అని స్పష్టం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల చట్టానికి ప్రతిపాదించిన సవరణలు కేవలం ఒక శాసన ప్రక్రియ మాత్రమే కాదని, అవి మన దేశంలోని కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు ప్రతిబింబమని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన పుర్బా మేదినీపూర్ జిల్లాలోని హల్దియాలో పర్యటించారు. ఈ క్రమంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వానికి బీజేపీని ప్రత్యామ్నాయంగా చూపుతూ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సృష్టించిన భయాందోళనలను తొలగించి శాంతిని, చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించడం మొదటి గ్యారెంటీ కాగా.. ప్రభుత్వ వ్యవస్థను ప్రజలకు పూర్తి జవాబుదారీగా మార్చడం రెండో వాగ్దానంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
రాష్ట్రంలో గతంలో జరిగిన అన్ని కుంభకోణాలు, అవినీతి అక్రమాలు, మహిళలపై జరిగిన అన్యాయాలకు సంబంధించిన ఫైళ్లను తిరిగి తెరిచి విచారణ జరిపిస్తామని మూడో గ్యారెంటీగా హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరని, వారందరినీ జైలుకు పంపిస్తామని నాలుగో గ్యారెంటీగా ప్రకటించారు. రాజ్యాంగబద్ధంగా శరణార్థులందరికీ పూర్తి హక్కులు కల్పిస్తూనే, అక్రమ చొరబాటుదారులను రాష్ట్రం నుంచి వెళ్లగొడతామని ఐదో గ్యారెంటీగా స్పష్టం చేశారు.
చివరగా ఆరో గ్యారెంటీగా.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల కోసం 7వ పే కమిషన్‌ను అమలు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బెంగాల్ ను వినాశనానికి నిలయంగా మార్చిన ‘నిర్మమ్(క్రూరమైన)’ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలను కోరారు.
ప్రధానిని వ్యతిరేకిస్తే బెంగాల్‌కే నష్టం
ఆరు గ్యారెంటీల అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ..డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే పశ్చిమ బెంగాల్ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తృణమూల్ పాలనలో బెంగాల్‌లో అవినీతి, కట్ మనీ(కమీషన్), సిండికేట్ రాజ్యం నడుస్తున్నదని విమర్శించారు.
" బెంగాల్‌ను దోచుకున్నది మంత్రులైనా, వారి అనుచరులైనా జైలుకు పంపిస్తం.తృణమూల్ సిండికేట్ పాలనకు చరమగీతం పాడుతాం.టీఎంసీకి బుజ్జగింపు రాజకీయాలే ముఖ్యం.ప్రధానమంత్రిని వ్యతిరేకించడం వల్ల బెంగాల్ రాష్ట్రానికి,అక్కడి ప్రజలకే నష్టం. అభివృద్ధి జరగాలంటే కేంద్రం, రాష్ట్రం ఒకే తాటిపై నడవాలి. బెంగాల్‌ను మళ్లీ 'సోనార్ బంగ్లా(బంగారు బెంగాల్)'గా మార్చాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అత్యవసరం. చేపల ఉత్పత్తిలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైంది.
బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మత్స్య సంపదలో, ఆహార ఉత్పత్తిలో స్వయంసమృద్ధిగా తీర్చిదిద్దుతాం" అని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీలు నమ్మకం మీద నడుస్తాయని, ఆ నమ్మకాన్ని కేవలం బీజేపీ మాత్రమే ఇవ్వగలదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
