న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నిత్యం ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకునే ప్రధాని మోడీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు శనివారం (ఏప్రిల్ 10) పార్లమెంటులోని ప్రేరణా స్థల్ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ రేర్ సీన్ చోటు చేసుకుంది.
మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి నివాళులర్పించేందుకు వచ్చిన ప్రధాని మోడీ అక్కడే ఉన్న రాహుల్ గాంధీని ఆత్మీయంగా పలకరించారు. కాసేపు ఇరువురు మాట్లాడుకున్నారు. అనంతరం ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఉప్పు నిప్పులా ఉండే మోడీ, రాహుల్ ఆప్యాయంగా మాట్లాడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు మార్గదర్శకం ఫూలే: మోడీ
జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పూలే జీవితం సమానత్వం, న్యాయం, విద్య అనే ఆదర్శాలకు అంకితమైందని గుర్తు చేశారు. మహిళలు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణలో ఫూలే ఒక మార్గదర్శకుడని కొనియాడారు. సామాజిక ప్రగతి సాధనలో ఆయన ఆలోచనలు ప్రతిఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు.
►ALSO READ | బార్డర్ లో పాక్ హైటెక్ నిఘా.. సోలార్ కెమెరాల ఏర్పాటు.. 11 మంది అరెస్ట్
సామాజిక న్యాయం వైపు ముందుకు సాగేందుకు ఫూలే ఆదర్శాలు, ఆలోచనలు ప్రతిఒక్కరినీ ఎప్పటికీ ప్రేరేపిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం దేశానికి సమానత్వం, న్యాయం వైపు మార్గాన్ని చూపిందని అన్నారు.
