కమలం కమాల్..మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం

కమలం కమాల్..మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం

 

  • రాజస్థాన్, చత్తీస్​గఢ్​లో ‘చేయి’జారిన పవర్.. మధ్యప్రదేశ్​లో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ 

జైపూర్/భోపాల్/రాయ్​పూర్ : మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. మధ్యప్రదేశ్​లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోనూ పవర్​ను కైవసం చేసుకుంది. ఆదివారం వెల్లడైన ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ మేరకు కమలం పార్టీ కమాల్ చేసింది. రాజస్థాన్​లో ప్రభుత్వం మారుతుందని, మధ్యప్రదేశ్​లో టఫ్ ఫైట్ ఉంటుందని, చత్తీస్​గఢ్​లో మళ్లీ కాంగ్రెస్​కే అధికారం దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

అందుకు తగ్గట్టే రాజస్థాన్​లో ఓటర్లు మళ్లీ ప్రభుత్వాన్ని మార్చేసి ప్రతిపక్షంలోని బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు. మధ్యప్రదేశ్​లో ‘మామ’ శివరాజ్ సింగ్ చౌహాన్ మ్యాజిక్​తో మరోసారి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే, చత్తీస్ గఢ్​లో కాంగ్రెస్ తిరిగి గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం తలకిందులయ్యాయి. బీజేపీ ఇక్కడ కూడా అనూహ్యంగా కాంగ్రెస్​ను ఓడించింది. సైలెంట్ విక్టరీతో అధికారాన్ని కైవసం చేసుకుని హస్తం పార్టీకి షాక్ ఇచ్చింది.