- 9వేల400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
- మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తెలంగాణకు పీఎం
- పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
- అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలనాథులు
- 2 లక్షల మందితో జన సమీకరణ
- అధికారిక కార్యక్రమాలకు రావాలని సీఎం రేవంత్‌కు ఆహ్వానం
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు:ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారి తెలంగాణ గడ్డపై అడుగుపెడుతున్నారు. దాదాపు రెండేండ్ల తర్వాత ఆయన వస్తుండడంతో బీజేపీ వర్గాల్లో జోష్ నెలకొన్నది. ఆదివారం రాష్ట్రానికి రానున్న ప్రధాని.. అభివృద్ధి, రాజకీయం అనే రెండు అజెండాలతో బిజీబిజీగా గడపనున్నారు.
ఒకవైపు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూనే.. మరోవైపు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని.. సాయంత్రం 7.20 గంటలకు నగరం వీడనున్నారు. దాదాపు ఐదు గంటల పాటు ఆయన రాష్ట్ర పర్యటన కొనసాగనుంది.
9,400 కోట్ల పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ. 9,400 కోట్ల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా రవాణా, పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చే ప్రాజెక్టులు ఉన్నాయి. హైదరాబాద్–పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా గద్వాల నుంచి మహబూబ్‌నగర్ వరకు 80 కిలోమీటర్ల మేర నిర్మించే 4 లైన్ల రహదారికి, జహీరాబాద్ పారిశ్రామిక సిటీకి ఆయన శంకుస్థాపన చేస్తారు.
అలాగే, రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును, కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్‌ను ప్రారంభించనున్నారు. వరంగల్ ‘పీఎం మిత్ర’ మెగా టెక్స్‌టైల్ పార్క్, మల్కాపూర్ గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం టర్మినల్‌లను జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ హెచ్ ఐసీసీ వేదికగా వర్చువల్‌గా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డికి అధికారికంగా ఆహ్వానం అందించారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున జాతీయ రహదారుల శాఖ రీజినల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యే ఈ వేడుకకు హాజరు కావాలని కోరారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి పీఎంతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు మోదీతో ప్రత్యేకంగా సమావేశమై మెట్రో విస్తరణతో పాటు పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిసింది.
పవన్, చంద్రబాబుతో మోదీ భేటీ..
అభివృద్ది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. సాయంత్రం 4:45 నుంచి సాయంత్రం 6:15 గంటల వరకు టైమ్ కేటాయించారు. ఈ టైమ్ లో తొలుత పవన్ కల్యాణ్ ను తన ఇంటికి వెళ్లి కలవనున్నారు. అనంతరం చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనతో పలు పొలిటికల్ అంశాలను చర్చించే అవకాశం ఉంది.
పరేడ్ గ్రౌండ్‌లో సత్తా చాటేలా..
అభివృద్ధి కార్యక్రమాలు ముగిసిన వెంటనే సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభను మునుపెన్నడూ లేని విధంగా కమలం నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే లక్ష్యంగా 2 లక్షల మందితో భారీ జన సమీకరణ చేస్తున్నారు. ముఖ్యంగా మోదీకి స్వాగతం పలికేందుకు వేలాది మంది మహిళలతో ప్రత్యేకంగా ప్లాన్ చేశారు.
ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ తొలిసారిగా వస్తుండడంతో.. తన మార్కును చూపించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్లెక్సీలు, కటౌట్లు, పోస్టర్ల తో పాటు వాల్ పేయింటింగ్‌తో నగరాన్ని కాషాయమయం చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి వెల్లడించారు. భద్రత కోసం సుమారు 2,000 మంది పోలీసులు, 550 మంది ట్రాఫిక్ సిబ్బందితో పాటు అక్టోపస్, బాంబ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బృందాలు నిరంతరం నిఘా ఉంచనున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బేగంపేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి పరిధిలో డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు.
సభకు వచ్చే వారు ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు, వాటర్ బాటిళ్లు వంటి ప్రమాదకర వస్తువులను తీసుకురాకూడదని పోలీసులు స్పష్టం చేశారు. పరేడ్ గ్రౌండ్స్, ప్యారడైజ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, జిల్లాల నుంచి వచ్చే బస్సుల కోసం ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా వరంగల్, నల్గొండ నుంచి వచ్చే వాహనాలను ఉప్పల్ స్టేడియం వద్ద నిలిపి, అక్కడి నుంచి మెట్రో ద్వారా పరేడ్ గ్రౌండ్స్ చేరుకోవాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులను గుర్తిస్తే వెంటనే 100కు లేదా సమీప పోలీసులకు సమాచారం అందించాలని సీపీ కోరారు.
ప్రారంభించే ప్రాజెక్టులు.. శంకుస్థాపనలు ఇవే..
n పారిశ్రామికాభివృద్ధి: రూ. 2,360 కోట్లతో జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన.
n నేషనల్ హైవేలు: రూ. 3,180 కోట్లతో ఎన్‌హెచ్-167 (గుడెబల్లూర్ నుంచి మహబూబ్ నగర్) 4 లేన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన.
n రైల్వే ప్రాజెక్టులు: రూ. 1,250 కోట్లతో కాజీపేట- విజయవాడ మూడో రైల్వే లైన్ సెక్షన్‌ను జాతికి అంకితం చేయనున్నారు.
n టెక్స్‌టైల్స్: రూ. 1700 కోట్లతో పీఎం మిత్ర పార్కు, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభోత్సవం.
n ఆయిల్ టెర్మినల్: రూ. 610 కోట్లతో మల్కాపూర్‌లో ఐఓసీఎల్ పీఓఎల్ టెర్మినల్ ప్రారంభం.
n రైల్వే బైపాస్: రూ.300 కోట్లతో కాజీపేట రైల్ అండర్ రైల్వే బైపాస్ ప్రారంభోత్సవం-----------
ప్రధాని పర్యటన షెడ్యూల్..
n మధ్యాహ్నం 1:10 గంటలకు బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరుతారు.
n మధ్యాహ్నం 2:20 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
n మధ్యాహ్నం 2:25 గంటలకు బేగంపేట నుంచి బయల్దేరి, 2:55 గంటలకు హైటెక్స్ (హెచ్ఐసీసీ) వేదిక వద్దకు చేరుకుంటారు.
n మధ్యాహ్నం 3:00 నుంచి 3:30 వరకు హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు.
n మధ్యాహ్నం 3:35 గంటలకు కార్యక్రమ వేదిక నుంచి బయల్దేరి, 3:40 గంటలకు హైటెక్ సిటీలోని సింధు ఆస్పత్రికి చేరుకుంటారు.
n మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు సింధు ఆస్పత్రిని ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు.
n సాయంత్రం 4:20 గంటలకు సింధు ఆస్పత్రి నుంచి బయల్దేరి.. 4:45 గంటలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
n సాయంత్రం 4:45 నుంచి సాయంత్రం 6:15 గంటల వరకు సమయం రిజర్వ్ టైమ్ (చంద్రబాబు, పవన్ ఇంటికి వెళ్లనున్నారు)
n సాయంత్రం 6:20 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరి, 6:25 గంటలకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.
n సాయంత్రం 6:30 నుంచి రాత్రి 7:10వరకు సికింద్రాబాద్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు.
n రాత్రి 7:10 గంటలకు బహిరంగ సభ వేదిక నుంచి బయల్దేరి, రాత్రి 7:15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
n రాత్రి 7:20 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరి, రాత్రి 9:20 గంటలకు గుజరాత్‌లోని జామ్‌నగర్ విమానాశ్ర యానికి చేరుకుంటారు.
