- చేతివాటం ప్రదర్శిస్తున్న అధికారులు
- ఆందోళనలో లబ్ధిదారులు
హుస్నాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కష్టాలు తీర్చాలని ' పీఎం స్వనిధి' స్కీమ్ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ హుస్నాబాద్మెప్మా ఆఫీసర్లు మాత్రం చిరు వ్యాపారులను ఆదుకోవాల్సింది పోయి అప్లికేషన్లను గాలికి వదిలేస్తున్నారు. కేంద్రం పైసలిస్తమన్నా క్షేత్రస్థాయిలో అధికారులు ఫైళ్లను కదిలించడం లేదు. ఫలితంగా పెట్టుబడి కోసం వ్యాపారులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చి నిలువునా మునుగుతున్నారు. పట్టణం రోజురోజుకూ పెరుగుతున్నా కొత్తగా వస్తున్న వ్యాపారులకు ఈ స్కీము గురించి చెప్పే నాథుడే కరువయ్యారు.
2025--– -26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హుస్నాబాద్ మున్సిపాలిటీకి ఇచ్చిన టార్గెట్లు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. పక్కనే ఉన్న దుబ్బాక వంటి ఊర్లల్లో ఆఫీసర్లు వంద శాతం లోన్లు ఇప్పించి రికార్డులు సృష్టిస్తుంటే హుస్నాబాద్ మాత్రం అట్టడుగున ఉండడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. మొదటి విడత 89 టార్గెట్ ఉంటే కేవలం 26 మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 63 అప్లికేషన్లు మూలకు పడి ఉన్నాయి. రెండో విడతలో 31 టార్గెట్ ఉంటే కేవలం నలుగురికే సాయం చేశారు. ఇంకా 27 మంది ఎదురుచూస్తున్నారు. మూడో విడతలో 20 టార్గెట్ ఉంటే 15 మాత్రమే పూర్తి చేసి మమ అనిపించారు.
అవగాహన సున్నా..
లోన్ కావాలంటే ఎవర్ని కలవాలి? ఏమేం కాగితాలు కావాలి? అన్న ముచ్చట చెప్పేటోళ్లే లేరు. మున్సిపల్ ఆఫీసుల కనీస సమాచారం లేదని వ్యాపారులు మండిపడుతున్నారు. మరోవైపు లోన్ల మంజూరులో కొందరు సిబ్బంది 'చేతివాటం' ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైసలిస్తేనే ఫైలు కదులుతుందని, లేదంటే బ్యాంకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిప్పుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఓటర్ ఐడీ, గుర్తింపు కార్డు ఉంటే చాలని రూల్స్ చెప్తున్నా ఆఫీసర్లు మాత్రం సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు.
అప్పుల ఊబిలో వ్యాపారులు..
పండ్లు, కూరగాయలు, టిఫిన్ సెంటర్లు నడుపుకునే చిన్న వ్యాపారులు పెట్టుబడి కోసం రోజూవారీ వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. సర్కారు అప్పు సకాలంలో అందితే ఈ తిప్పలు ఉండేవి కావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, పై అధికారులు స్పందించి హుస్నాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న లోన్లను వెంటనే ఇప్పించాలని పని చేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
కట్టి ఆరు నెలలైతంది.. మళ్లీ ఇస్తలేరు!
గతంలో రూ.20 వేల లోన్ ఇచ్చారు. అవి కట్టి ఆరు నెలలైతంది. మళ్లీ లోన్ ఇయ్యమంటే ఇస్తలేరు. ఉన్నోళ్లకే లోన్లు ఇస్తున్నరు.. మాలాంటి లేనోళ్లను పట్టించుకుంటలేరు. ఇప్పటికైనా లోన్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలె.- ప్రమీల, పండ్ల వ్యాపారి
అవగాహన కల్పిస్తున్నాం..
స్ట్రీట్ వెండర్ స్కీంపై అవగాహన కల్పిస్తున్నాం. ఒక్కొక్క ఆర్పీలకు 10 టార్గెట్ ఇచ్చాం. వాళ్లు సర్వే చేస్తున్నారు. ఎస్బీఐ, యూబీఐ, టీజీబీ బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తున్నాం. రూ.50 వేల లోన్ అయిపోతే వ్యాపారులకు రూ.30 వేల క్రెడిట్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. సర్క్యులర్ లేట్ గా రావడం వళ్ల కొంత ఆలస్యం అవుతుందన్నారు.-హన్మంత్ రెడ్డి, మెప్మా జిల్లా ఇన్చార్జి
