పద్మారావునగర్: పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏండ్ల జైలు

పద్మారావునగర్: పోక్సో కేసులో వ్యక్తికి  20 ఏండ్ల జైలు

పద్మారావునగర్, వెలుగు: పోక్సో కేసులో ఓ వ్యక్తికి 20 ఏండ్ల జైలుశిక్షతోపాటు రూ.16 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు 12వ  అదనపు సెషన్స్ జడ్జి ఎం.అర్చన కుమారి తీర్పునిచ్చారు. చందానగర్ కు చెందిన గుమ్ముల నాగరాజు ఓ బాలిక(16) ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ చేయించుకోవాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అంతటితో ఆగకుండా 2019 మార్చి 2న బాలికను బలవంతంగా బయటకు తీసుకెళ్లి, తీవ్రంగా కొట్టి, నగ్న వీడియోలు, ఫొటోలు తీశాడు. వాటిని తన స్నేహితులకు చూపిస్తానని, బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. 

బాధితురాలు విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గాంధీనగర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి చైతన్యపురి ఏసీపీ(ప్రస్తుతం చిక్కడపల్లి ఏసీపీ) వై.నరసింహారెడ్డి, రెండో దర్యాప్తు అధికారి శ్రీధర్ ఈ కేసును దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ వేశారు. నేరం రుజువు కావడంతో నాగరాజుకు జడ్జి శనివారం శిక్ష ఖరారు చేశారు.