- 200 టీఎంసీలు తరలించుకునేందుకు ఏపీ యత్నం
- 480 టీఎంసీలను మించి వాడుకునే ప్లాన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ తరపున సింఘ్వీ వాదనలు
- ప్రాజెక్టు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది
- నా ఇల్లు నేను కట్టుకుంటే పక్కోడికి ఏం ఇబ్బంది
- ఏపీ తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహిత్గీ
- మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలన్న సుప్రీం
- విచారణ వచ్చే సోమవారానికి వాయిదా
ఢిల్లీ: గోదావరిలో వరద జలాల పేరుతో అసలు జలాలకు ఎసరు పెట్టాలని ఏపీ ప్రయత్నిస్తోంద ని సుప్రీంకోర్టులో తెలంగాణ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఏపీ నిర్మిస్తున్న పోలవరం -నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు కేసు విచారణ ఇవాళ ( జనవరి 5) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వం లోని ధర్మాసనం ఎదుట జరిగింది.
తెలంగాణ తరఫున సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. నల్లమల సాగర్ ద్వారా గోదావరి జలాల్లో అవార్డు ప్రకారం కేటాయించిన 480 టీఎంసీలకు మించి వాడుకునేందుకు ఏపీ ప్రయత్నిస్తోందన్నారు. వరద జలాల పేరుతో నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 200 టీఎంసీలు తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తు న్నదని చెప్పారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. వరద జలాలు అనేది ఎక్కడా లేదని అన్నారు. ముఖ్యంగా గోదావరి నదిలో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల నీటి వాటాకు ఈ ప్రాజెక్టు వల్ల ముప్పు పొంచి ఉందన్నారు.
కేంద్ర జల సంఘం ఇచ్చిన ఆదేశాలను కూడా ఏపీ పట్టించుకోవడం లేదు అని సింఘ్వీ వాదించారు. ఈ ప్రాజెక్టుపై తక్షణమే స్టే ఇవ్వాలని కోరారు. ఏపీ తరఫున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపిస్తూ.. ఈ ప్రాజెక్టు ఇంకాప్రాథమిక దశలోనే ఉందని, కేవలం డీపీఆర్, సర్వేల కోసం మాత్రమే టెండర్లు పిలుస్తున్నా మని ఆయన స్పష్టం చేశారు. నా ఇల్లు నేను కట్టుకుంటే పక్కవారికి అభ్యంతరం ఏంటీ అనే ఆసక్తికరమైన ఉదాహరణతో రోహత్గి తన వాదన వినిపించారు.
రాయలసీమ వంటి కరవు ప్రాంతాలకు నీటిని అందించడమే తమ లక్ష్యమని ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు లేవని స్పష్టం చేశారు. సముద్రంలోకి వృథాగా పోతున్న జలాలను వాడుకోవడమే తమ ఉద్దేశమని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచిస్తూ తదుపరి విచారణ ను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.
