
సిద్దిపేట, వెలుగు: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 50కి పైగా లారీలను పట్టుకున్న పోలీసులు పెద్దల ఒత్తిళ్లతో ఒదిలేసిన సంఘటన ఆదివారం రాత్రి బెజ్జంకి మండలం రాజీవ్ రహదారిపై జరిగింది. రేగులపల్లి నుంచి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న లారీలు బెజ్జంకి వద్ద రాజీవ్ రహదారిపై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా 50కు పైగా లారీల్లో ఇసుకను తరలిస్తుండగా బెజ్జంకి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ముఖ్య ప్రజాప్రతినిధితో పాటు ఓ పోలీసు ఆఫీసర్ జోక్యం చేసుకుని వెంటనే వారిని వదిలిపెట్టాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. దాదాపు అరగంటకు పైగా రాజీవ్ రహదారిపై ఇసుక లారీలు నిలిచిపోగా పెద్దల ఒత్తిళ్ల తో వాటిని వదిలేసినట్టు సమాచారం. రాత్రివేళల్లో రేగులపల్లి నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు ఇసుకను ప్రముఖ కాంట్రాక్టర్ ఒకరు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. లారీలు పట్టుకున్న విషయం సదరు కాంట్రాక్టర్ కు తెలియడంతో ముఖ్య ప్రజాప్రతినిధి, పోలీసు ఆఫీసర్‌కు ఆయన సమాచారం ఇచ్చి వారి ఆదేశాల ప్రకారం లారీలను వదిలినట్లు తెలుస్తోంది.