హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర పోలీస్ శాఖ 'అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. ప్రస్తుతం చలికాలంలో పొగమంచు కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నది.
ఇందులో భాగంగా పొగమంచు సమయంలో రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రచారం చేస్తున్నది. ఈ మేరకు డీజీపీ కార్యాలయం ఆదివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా కనిపించని పరిస్థితులు ఉంటాయని హెచ్చరించింది.
ఈ కారణంగా ముందున్న వాహనం లేదా ఆగి ఉన్న వాహనం ఎంత దూరంలో ఉందో అంచనా వేయడం కష్టమవుతుంది. అందుకే డ్రైవర్లు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను సమర్థంగా నివారించవచ్చని ప్రకటనలో సూచించారు.
డ్రైవర్లు తీసుకోవలసిన జాగ్రత్తలివే..
- పొగమంచు వల్ల ప్రయాణాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. నిర్ణీత సమయం కంటే ముందుగానే బయలుదేరాలి.
- తెల్లవారుజామున మంచులో అతివేగంగా డ్రైవ్ చేయడం, ఓవర్ టేకింగ్ చేయడం ప్రమాదకరం.
- హై-బీమ్ లైట్ల నుంచి వచ్చే కాంతి విచ్ఛిన్నమై, ఎదురుగా చూడటం మరింత కష్టమవుతుంది. కాబట్టి, తప్పనిసరిగా లో-బీమ్ హెడ్‌లైట్లను మాత్రమే వాడండి. ఫాగ్ లైట్లు ఉంటే ఉపయోగించాలి.
- ముందు ఉన్న వాహనానికి, మీ వాహనానికి మధ్య తగినంత దూరాన్ని పాటించాలి. దీనివల్ల ముందు వాహనం సడన్ బ్రేక్ వేసినా, అదుపు తప్పినా దాన్ని ఢీకొట్టకుండా నివారించవచ్చు.
- నిర్దేశించిన లేన్లలో మాత్రమే వాహనాన్ని నడపాలి.
- వాహనం నడిపేటప్పుడు కిటికీ అద్దాలను కొద్దిగా దించడం వల్ల పొగమంచు కేంద్రీకృతం కాదు. దీని వల్ల రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది.
- పొగమంచు ఉండి, రోడ్డు కనిపించకపోతే వాహనాన్ని ఆపాలి. మంచు తగ్గిన తరువాత బయలుదేరాలి.
- ఇండికేటర్లను తప్పనిసరిగా వినియోగించాలి. పార్కింగ్ లైట్లు వేసుకుంటే ఇతర వాహనదారులకు స్పష్టంగా తెలుస్తుంది.
