మావోయిస్టులకు పోలీసుల చెక్​.. పక్కాగా నిఘా

మావోయిస్టులకు పోలీసుల చెక్​.. పక్కాగా నిఘా
  •     గుత్తికోయల గ్రామాల్లో సౌకర్యాలు 
  •     సోలార్​ లైట్లు,  సోలార్ ​వాటర్​ ఫెసిలిటీస్​
  •     గిరిజనులను చంపుతున్నారని వాల్​పోస్టర్లతో ప్రచారం?
  •     పోలీస్​, ఆర్మీల్లో చేరేలా యూత్​కు ఫ్రీ ట్రైనింగ్​
  •     అడవుల్లో కూంబింగ్​తో మావోయిస్టులకు అడ్డుకట్ట

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగుమావోయిస్టులకు చెక్​ పెట్టేందుకు పోలీసులు తమకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. ఓ వైపు మావోయిస్టులు జిల్లాలోకి అడుగు పెట్టకుండా నిఘా పెడుతూనే, మరోవైపు జనంలోకి రావాలంటూ పిలుపునిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను కలుస్తూ సానుభూతిపరులను ప్రతిక్షణం గమనిస్తున్నారు. ఇందులో భాగంగానే దాదాపు 60 కేసులున్న మావోయిస్టు ఎల్​జీఎస్​ కమాండర్​తో పాటు ఎల్​జీఎస్​మెంబర్​ను  అరెస్టు చేశారు.

నిఘా…సమాచారం ​

మావోయిస్టులను ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోకి అడుగు పెట్టకుండా పక్కాగా నిఘా పెడుతున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్లు, ఎదురుకాల్పుల్లో కొన్ని డైరీలు, కిట్​ బ్యాగ్​లు దొరికాయి. దీనికి తోడు ఈ మూడు నెలల కాలంలో  దాదాపు వంద మందికి పైగా సానుభూతిపరులు, గ్రామ కమిటీ సభ్యులను అరెస్టు చేశారు. మరో 10 నుంచి 15 మంది లొంగిపోయేలా ప్లాన్​ చేశారు.

గ్రామాల్లో వసతులు కల్పిస్తూ

మావోయిస్టులకు గుత్తికోయలే ప్రధానంగా షెల్టర్​ ఇస్తున్నారనే సమాచారంతో ఆయా గ్రామాల్లో మావోయిస్టులు రాకుండా ప్లాన్​ చేస్తున్నారు. గుత్తికోయల గ్రామాల్లో సోలార్​ లైట్లు, సోలార్ ​వాటర్​ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇన్​ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఈ మధ్య దాదాపు 25 నుంచి 30 మంది వరకు చంపిన ఘటనలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. అన్యాయంగా గిరిజనులను పొట్టన పెట్టుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజన సంఘాల పేరుతో  పోస్టర్లు, కరపత్రాలు వేయిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మావోయిస్టుల్లోకి యువతీ యువకులు చేరకుండా వారిని ఆకట్టుకునేందుకు స్పోర్ట్స్​ నిర్వహించడం, కిట్స్​ పంపిణీ, పోలీస్​,  ఆర్మీలో చేరేలా ఫ్రీ ట్రైనింగ్​ ఇవ్వడం చేస్తున్నారు.

ఓఎస్​డీ తిరుపతి ఆధ్వర్యంలో కూంబింగ్​

చలికాలంలో అడవులు దట్టంగా ఉంటాయి. ఈ అంశం మావోయిస్టులకు కలిసి వస్తుంది. అలాగే ఇటీవల జరిగిన ఎన్​కౌంటర్లలో ఆరుగురికి పైగా మావోయిస్టులు చనిపోగా ప్రతీకారం కోసం మావోయిస్టులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఎస్​పీ సునీల్​దత్​ పర్యవేక్షణలో ఓఎస్డీ తిరుపతి ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున బలగాలతో ఛత్తీస్​గఢ్ ​సరిహద్దు అటవీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. మావోయిస్టు నేతలు హరిభూషన్​, దామోదర్​, ఆజాద్​లు తెలంగాణ రాష్ట్రంలో లో పాగా వేసేందుకు ప్లాన్​ చేస్తున్నారనే సమాచారంతోనూ  స్పెషల్​ ఫోకస్​ పెట్టారు.