ఏఐ సమిట్లో యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఏఐ సమిట్లో యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు
  • కాంగ్రెస్​ తీరుపై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రుల ఫైర్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్​లో యూత్ కాంగ్రెస్ నేతలు అర్ధనగ్నంగా ఆందోళన చేపట్టారు. శుక్రవారం సమిట్ లో ప్రముఖ కంపెనీల సీఈఓలు సాంకేతికతలో విప్లవాత్మక పురోగతి గురించి మాట్లాడుతుండగా.. పలువురు యూత్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలు టీ షర్టులు తీసేసి అర్ధనగ్నంగా మోదీ, ట్రంప్ చిత్రాలు ఉన్న టీ షర్టులతో 5వ నంబర్ హాల్​లోకి చొచ్చుకెళ్లారు. 

అనంతరం భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సమిట్​లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే పోలీసులు వచ్చి ఆందోళనకారులను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. వారిలో నలుగురు నిరసనకారులను అరెస్ట్ చేశారు. వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, యూత్​ కాంగ్రెస్ కార్యకర్తల తీరును బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను చూసి కాంగ్రెస్​అసూయపడుతోందని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, రాజ్​నాథ్​సింగ్, గజేంద్ర సింగ్​షెకావత్ ఈ ఘటనపై స్పందిస్తూ.. కాంగ్రెస్ కు ఇది సిగ్గుచేటు అని మండిపడ్డారు. 

భారత్ తనను తాను ప్రపంచ సాంకేతిక శక్తి కేంద్రంగా నిలబెట్టుకోవడానికి అడుగులు వేస్తున్న తరుణంలో, కాంగ్రెస్ దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇది రాజకీయ వ్యతిరేకత కాదని, మన దేశ ప్రపంచ ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీసే నీచమైన ప్రయత్నమని ఎక్స్​లో పోస్టు చేశారు. అలాగే, కొంతమంది బీజేపీ యూత్ వింగ్ సభ్యులు రాహుల్ గాంధీ నివాసం వద్ద భారీ నిరసన చేపట్టారు.