- ప్రేమించిన యువతి ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
పిట్లం, వెలుగు: తెల్లారితే పెళ్లి అనగా పెండ్లి కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. తనను మూడేళ్లుగా ప్రేమించి, మరొకరితో పెండ్లికి సిద్ధమయ్యాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
మద్నూర్ మండలం మోగా గ్రామానికి చెందిన మారుతి అనే యువకుడి పెండ్లి సోమవారం మద్నూర్ మైథిలి ఫంక్షన్ హాల్లో జరగాల్సి ఉంది. బిచ్కుందకు చెందిన ఓ యువతి, మారుతి మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే మరొకరిని పెండ్లి చేసుకుంటున్నాడని తెలియడంతో ఆ యువతి ఆదివారం బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆదివారం రాత్రి మారుతిని అదుపులోకి తీసుకున్నారు.
