అధిక వడ్డీల ఆశ చూపి అమాయక ప్రజల శ్రమను దోచుకున్న ఒక కిలాడీ లేడీ ఎట్టకేలకు పోలీసుల దొరికింది. హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడి, గత ఏడాది కాలంగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న నిందితురాలు శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బంజారాహిల్స్ లోని నందినగర్, దాని పరిసర ప్రాంతాలే లక్ష్యంగా ఈ మాయలేడి తన స్కెచ్ అమలు చేసింది. నమ్మిన వారికి అధిక వడ్డీలు ఇస్తానంటూ ఆశ చూపించి.. దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. డబ్బు చేతికి అందగానే శ్రీలక్ష్మి, ఆమె భర్త సత్యప్రసాద్‌తో కలిసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి పరారైంది. తాము దాచుకున్న డబ్బుతో నిలువునా మునిగిపోయామని గ్రహించిన బాధితులు.. ఏడాది క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వీరిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
అయితే రోజురోజుకూ ఈ కిలాడీ లేడీ చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య పెరిగిపోవడంతో.. కేసు తీవ్రతను బట్టి దీనిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి సీసీఎస్ (CCS) విభాగానికి బదిలీ చేశారు. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు పక్కా సమాచారంతో నిందితురాలు శ్రీలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఆమె భర్త సత్యప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అధిక వడ్డీల ఆశ చూపే ఇలాంటి కేటుగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
