వంద తులాల బంగారం దొంగలు దొరికిన్రు... ఇటీవల మెదక్ జిల్లా చీలపల్లిలో ఐదు ఇండ్లలో చోరీ

వంద తులాల బంగారం దొంగలు దొరికిన్రు... ఇటీవల మెదక్ జిల్లా చీలపల్లిలో ఐదు ఇండ్లలో చోరీ
  • ఒకే ఇంట్లో వంద తులాలకు పైగా బంగారం  మాయం
  • సంగారెడ్డి జిల్లాకు చెందిన బావబామ్మర్దులే దొంగలు
  • రూ.1.35 కోట్ల విలువైన సొత్తు రికవరీ
  • ఇద్దరు అరెస్ట్​.. పరారీలో మరో ఇద్దరు..

మెదక్, వెలుగు: పెద్దశంకరంపేట మండలం చీలపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరిని అరెస్టు చేసి సుమారు రూ.1.35 కోట్ల విలువైన చోరీ సొత్తును రికవరీ చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ నెల 14న రాత్రి గ్రామంలో తాళం వేసిన ఐదు ఇళ్లలో చోరీ జరిగింది. 112 తులాల బంగారం, 2.5 కిలోల వెండి, నగదు దోచుకెళ్లారు. ఇందులో కేవలం రాయిని రాములు ఇంట్లోనే 109 తులాల బంగారం చోరీకి గురికావడం సంచలనం రేపింది. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేశారు. 

విచారణలో సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ప్రాంతానికి చెందిన జాదవ్ జైరాం నాయక్ అలియాస్ జెమ్లా నాయక్, అతని బావ రాథోడ్ ఇప్పు సింగ్ ఈ చోరీలకు పాల్పడినట్లు తేలింది. వీరు బైక్‌‌పై గ్రామాల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తారని పోలీసులు తెలిపారు. రికవరీలో 92.9 తులాల బంగారం, 1.7 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. కొంత సొత్తును నిందితుడి తల్లి ఇంటి ఆవరణలో పాతిపెట్టినట్లు గుర్తించారు. 

ఈ కేసులో జైరాం నాయక్, అతని తల్లి మాలిబాయి అరెస్టు కాగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగతా సొత్తు కూడా త్వరలో రికవరీ చేస్తామని ఎస్పీ వెల్లడించారు. జాదవ్ జైరాం నాయక్ పై 78 దొంగతనాల కేసులు కోర్టులో ట్రయల్​లో ఉన్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ 12 చోరీలకు పాల్పడ్డాడు.