చోరీ బైక్ లను ఓఎల్ ఎక్స్ లో అమ్మేస్తూ.. ముగ్గురు దొంగల అరెస్ట్

చోరీ బైక్ లను ఓఎల్ ఎక్స్ లో అమ్మేస్తూ.. ముగ్గురు దొంగల అరెస్ట్
  •  14  బైక్​లు స్వాధీనం 

కంటోన్మెంట్, వెలుగు:  జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు ఫ్రెండ్స్ చోరీల బాట పట్టారు. రాత్రిపూట రెక్కి వేసి పార్కు చేసిన బైక్​లను తెల్లవారు జామున ఎత్తుకెళ్తారు. వాటిని ఫేక్ ఆర్సీలతో ఓఎల్​ఎక్స్​లో అమ్ముతున్నారు. సోమవారం నార్త్​జోన్​ డీసీపీ రోహిణి ప్రియదర్శిని మీడియాకు  తెలిపారు. సూరారం పరిధి అమిత్ ​బస్తీకి చెందిన బైక్​ మెకానిక్​రజాక్ ఖాన్(38), ఏపీలోని వెస్ట్​గోదావరి జిల్లాకు చెంది.. హఫీజ్​పేట్​లో ఉండే కారు డ్రైవర్ ​యమ్మాల యోహాను (30) ఫ్రెండ్స్.  వీరు జల్సాలకు బానిసలుగా మారగా.. వచ్చిన సంపాదన సరిపోవడంలేదు.

ఈజీగా మనీ సంపాదించేందుకు  గతేడాది అక్టోబర్​ నుంచి చోరీలకు పాల్పడుతున్నారు.  కాలనీలు, బస్తీల్లో రాత్రి పూట రెక్కి వేసి..  తెల్లవారు జామున రోడ్డు పక్కన పార్కు చేసిన బైక్​లను ఎత్తుకెళ్తున్నారు. వాటికి ఫేక్ ఆర్సీలు తయారు చేయించి ఓల్ఎస్ఎక్స్ ఒక్కో బైక్​ రూ.10వేల నుంచి రూ.15వేలకు అమ్ముతున్నారు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు.  ఇప్పటికే వీరు నాంపల్లి, బోయిన్​పల్లి, తిరుమలగిరి, జీడిమెట్ల, అల్వాల్​ ప్రాంతాల్లో 17 బైక్​లు చోరీ చేశారు.

బాధితుల ఫిర్యాదులతో నిఘా పెట్టిన బోయిన్​పల్లి పోలీసులు.. డెకాయిట్ ఆపరేషన్ ద్వారా దొంగల  ఇండ్లకు వెళ్లి రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వీరు ఇచ్చిన వివరాలతో ఫేక్ ఆర్సీలు తయారు చేసే ఏపీకి చెందిన వెంకటప్పయ్యను అరెస్టు చేశారు. ముగ్గురి వద్ద 14 బైక్​లు, ఒక ల్యాప్​టాప్​ను  స్వాధీనం చేసుకోగా.. వాటి విలువ రూ.8లక్షలు.  మిగతా మూడు బైక్ ల​ రికవరీకి ప్రయత్నిస్తున్నామని డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. బోయిన్​పల్లి పోలీసు టీమ్​ను అభినందించారు.