
- ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు స్మగ్లింగ్
- ముగ్గురు సభ్యుల అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన ఈగల్ టీమ్
- 935 కిలోల గంజాయి ప్యాకెట్లు, రెండు వాహనాలు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముగ్గురిని ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) టీం పట్టుకుంది. ఖమ్మం, రాచకొండ నార్కోటిక్స్ యూనిట్ల జాయింట్ ఆపరేషన్‌తో రూ.5 కోట్ల విలువైన 935 కిలోల గంజాయి, రెండు వాహనాలను శనివారం సీజ్ చేసింది. ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసింది. ఈ వివరాలను ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నిందితులంతా మహారాష్ట్రకు చెందినవారని ఆయన తెలిపారు. వారిని పవార్ కుమార్, సమాధాన్ కంటిల్ బిసే, వినాయక్ బాబాసాహెబ్ పవార్‌గా గుర్తించామని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన ముఠా, ఒడిశాలోని గంజాయి సప్లయర్స్‌తో ముందస్తు ఒప్పందాలు చేసుకుని గంజాయి సరఫరా చేస్తున్నట్టు ఈగల్ టీం ఆధారాలు సేకరించింది.
గంజాయి కేసుల్లో పాత నేరస్తుడు పవార్ కుమార్ బడు ఒడిశా నుంచి మహారాష్ట్రకు రెగ్యులర్‌గా గంజాయి తరలిస్తున్నాడు. తన అనుచరుడు సమాధాన్ కంటిల్ బిసే, వినాయక్ బాబాసాహెబ్ తో కలిసి ఈ నెల 23న అద్దె ఇన్నోవాలో మహారాష్ట్ర నుంచి రాజమండ్రి వెళ్లారు. గంజాయి సప్లయర్ల ద్వారా టాటా ఐచర్‌లో పండ్ల ట్రేల కింద 935 కిలోలు గల 455 గంజాయి ప్యాకెట్లను లోడ్ చేశారు. దానికి ఎస్కార్ట్‌గా ఇన్నోవాలో బయలుదేరారు. ఒడిశా నుంచి ఏపీ మీదుగా మహారాష్ట్రకు పెద్ద మొత్తంలో గంజాయి సరఫరా చేస్తున్నట్టు సమాచారం అందడంతో ఈగల్ టీమ్ అప్రమత్తమైంది. రీజినల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెంటర్ (ఆర్‌ఎన్‌సీసీ) ఖమ్మం, రాచకొండ నార్కోటిక్స్ పీఎస్ ఈగల్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఈ నెల 26న తెల్లవారుజామున 3 గంటల సమయంలో బాటసింగారం పండ్ల మార్కెట్ సమీపంలో టాటా ఐచర్‌ను అడ్డగించి సోదాలు చేసింది. పండ్ల ట్రేల కింద దాచిన గంజాయిని గుర్తించింది.