సికింద్రాబాద్ లో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాకం.. భర్త వీర్యకణాలతో కాకుండా మరో వ్యక్తి స్పెర్మ్ తో సంతానం..

సికింద్రాబాద్ లో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాకం..  భర్త  వీర్యకణాలతో  కాకుండా మరో వ్యక్తి స్పెర్మ్ తో సంతానం..

సంతానం కోసం  దంపతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.  ఐవీఎఫ్  అని, టెస్ట్ ట్యూబ్ బేబీ అని ,సరోగసి అని ఇలా రకరకాల పేర్లతో వెలుస్తోన్న ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ పిల్లల కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. తీరా సంతానం అవుతుందా అంటే?  గ్యారంటీ ఉండదు.

ఈ మధ్యనే మాదాపూర్ లోని ఓ ఐవీఎఫ్ సెంటర్ లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల  ఓ గర్భిణీ చనిపోయింది. ఇటీవల ఇలాంటి దారుణాలు చాలానే జరుగుతున్నాయి .  లేటెస్ట్ గా సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్   ట్యూబ్ బేబీ సెంటర్ లో వైద్యులు ఓ మహిళకు తన భర్త వీర్యం కాకుండా మరో వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కల్గించారు. దీంతో  బాధిత దంపతులు  టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

అసలేం జరిగిందంటే.?  ఓ మహిళ సంతానం కోసం సికింద్రాబాద్ లోని  సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను ఆశ్రయించింది. తన భర్త శుక్రకణాలతో సంతానం కల్గించాలని వైద్యులను కోరింది. దీంతో   డాక్టర్ దగ్గర   చికిత్స తీసుకుంది.  సంతానం కలిగిన తర్వాత పుట్టిన శిశువుకు క్యాన్సర్ రావడంతో అనుమానంతో   డీఎన్ఏ టెస్టులు చేయించారు దంపతులు. దీంతో శిశువు డీఎన్ఏ తన భర్త డీఎన్ఏతో మ్యాచ్ కాకపోవడంతో   బాధిత దంపతులు  గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  

కేసు నమోదు చేసుకున్న పోలీసులు జులై 26న  వైద్యశాఖ రెవెన్యూ అధికారులతో కలిసి టెస్ట్ ట్యూబ్ బేబీ  సెంటర్లో తనిఖీలు చేపట్టారు.  అనుమతులను పరిశీలించడంతో పాటు గతంలో కూడా ఇదే తరహాలో మోసం చేసిన కేసులు ఉన్నట్లు గుర్తించారు . ఎంత మందికి ఇలా ట్రీట్ మెంట్ ఇచ్చారు అనేదానిపై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.