- 19 మందిని బలిగొన్న బైకర్
- కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాదం కేసులో కొత్త కోణం
- బైక్ యాక్సిడెంట్ వల్లే బస్సు దగ్ధమైందని తేల్చిన పోలీసులు
- మద్యం మత్తులో తన ఫ్రెండ్ ఎర్రిస్వామితో కలిసి బైక్‌పై శివశంకర్ చక్కర్లు
- రోడ్డుపై స్కిడ్ అయి డివైడర్‌ను ఢీకొట్టడంతో యాక్సిడెంట్.. స్పాట్‌లోనే శివశంకర్ మృతి
- రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను అతివేగంగా వచ్చి ఢీకొట్టిన బస్సు
- బస్సు ముందు భాగంలో బైక్ ఇరుక్కుని, మంటలు చెలరేగి ప్రమాదం
- పోలీసుల అదుపులో ఎర్రిస్వామి.. బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య అరెస్టు
హైదరాబాద్, వెలుగు: కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి బస్సు దగ్ధం కేసు కొత్త మలుపు తిరిగింది. బైకర్ శివశంకరే ప్రమాదానికి కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తన స్నేహితుడు ఎర్రిస్వామి అలియాస్ నానితో కలిసి మద్యం మత్తులో బైక్ నడిపిన శివశంకర్.. అది స్కిడ్ అయ్యి రోడ్డుపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
రోడ్డుపై పడి ఉన్న ఆ బైక్ మీదుగా బస్సు దూసుకెళ్లడం వల్లే ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. ఓ పెట్రోల్ బంకులో సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదానికి కారణాలను నిర్ధారించారు. బస్సు డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్ట్ చేశారు. అలాగే శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ప్రకటన విడుదల చేశారు.
మద్యం మత్తులో బైక్‌పై చక్కర్లు
కర్నూలు జిల్లా బి తాండ్రపాడుకు చెందిన శివశంకర్(21) స్థానికంగా గ్రానైట్ బండలు పరిచే పనులు చేస్తుంటాడు. గురువారం రాత్రి 7 గంటలకు తుగ్గలికి చెందిన తన స్నేహితుడు ఎర్రిస్వామితో కలిసి బయటకు వెళ్లాడు. రాత్రి 9:30 గంటల సమయంలో తల్లి కాల్ చేయగా.. డోన్‌కి వెళ్లానని, ఆలస్యం అవుతుందని చెప్పాడు.
స్నేహితులిద్దరూ కలిసి అర్ధరాత్రి దాటే వరకు బైక్‌పై తిరిగారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఎర్రిస్వామిని అతని ఊరు తుగ్గలిలో వదిలిరావడానికి శివశంకర్ బయలుదేరాడు. ఎర్రిస్వామి వెనుక కూర్చోగా, శివశంకర్ బైక్ నడిపాడు.
వీళ్లు 2:24 గంటలకు పెద్ద టేకూరులోని కియా షోరూం దగ్గర హెచ్‌పీ పెట్రోల్ బంకులో రూ.300 పెట్రోల్ కొట్టించుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ మద్యం మత్తులో ఉన్నట్టు పెట్రోల్ బంకులోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయటపడింది. బంక్‌లోనే ఒకసారి బైక్ స్కిడ్కాగా, త్రుటిలో పడకుండా వెళ్లిపోయారు.
బైక్‌ను ఈడ్చుకెళ్లిన బస్సు..
శివశంకర్, ఎర్రిస్వామి పెట్రోల్ బంక్ నుంచి బయలు దేరిన కొద్దిసేపటికే.. చిన్నటేకూరు సమీపంలో వాళ్ల బైక్ స్కిడ్ అయి రోడ్డుకు కుడి పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న శివశంకర్ స్పాట్ లోనే చనిపోగా, వెనుక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రోడ్డు మధ్యలో పడి ఉన్న శివశంకర్‌ను ఎర్రిస్వామి రోడ్డు పక్కకు లాగి శ్వాస ఆడుతుందేమోనని చూశాడు. కానీ, చనిపోయాడని గుర్తించి, రోడ్డుపై పడి ఉన్న బైకును కూడా రోడ్డు పక్కకు లాగుదామని అనుకునేలోపే.. అతివేగంగా దూసుకొచ్చిన వేమూరి కావేరి బస్సు బైక్‌ను కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది.
బైక్ కాస్తా బస్సు ముందు భాగంలో ఇరుక్కొని రాపిడి వల్ల మంటలు అంటుకున్నాయి. దీంతో ఎర్రిస్వామి భయాందోళనకు గురై అక్కడి నుంచి తన సొంతూరు తుగ్గలికి పారిపోయాడు. ఈ ప్రమాదంపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని విచారించామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
ఆ ఒక్కరు ఎవరు?
బస్సు ప్రమాదంలో చనిపోయినోళ్ల మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు 18 మందిని గుర్తించారు. ఆరాంఘర్‌లో బస్సు ఎక్కిన ప్రయాణికుడు ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టికెట్ రిజర్వేషన్ లేకపోవడంతో అతను ఎవరనేది కర్నూలు పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసుల సహాయం తీసుకోనున్నట్టు తెలిసింది.
ఆరాంఘర్‌లో బస్సు ఎక్కిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌లు సహా అతడిని గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. మృతదేహాలకు కర్నూలు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. డెడ్‌బాడీలకు సంబంధించి కాలిపోకుండా మిగిలిన శరీర భాగాలు సహా బస్సులో లభించిన ఇతర ఆధారాలను సేకరించారు.
శనివారం వరకు 16 డెడ్‌బాడీలకు సంబంధించి.. బాధిత కుటుంబసభ్యులు, బంధువుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. వాటిని మంగళగిరిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. డీఎన్‌ఏ మ్యాచింగ్ అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్, పోస్టుమార్టంతో పాటు డీఎన్ఏ పరీక్షల రిపోర్టులకు రెండు, మూడు రోజుల సమయం పడుతుందని కర్నూల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు.
కర్నూల్ బస్సు ప్రమాద బాధితుల కోసం హెల్ప్ లైన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: కర్నూలు బస్సు ప్రమాదంలో మృతిచెందిన, గాయపడిన ప్రయాణికుల కుటుంబ సభ్యులకు సమాచారం, ఇతర సహకారం అందించేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ అధికారి ఈ. వెంకటాచారి తెలిపారు. ఎం నర్సయ్య, సూపరింటెండెంట్ వాట్సాప్ నెం 9063423950, బి. సంగీత, జూనియర్ అసిస్టెంట్, కంట్రోల్ రూమ్ నంబర్ 9063423979లో సంప్రదించొచ్చని పేర్కొన్నారు.
