మెదక్ టౌన్, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్ సూచించారు. శుక్రవారం రాత్రి మెదక్ పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ న్యూ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, ఓల్డ్ బస్టాండ్, గర్ల్స్ హైస్కూల్, పొట్టి శ్రీరాములు విగ్రహం, చమన్ హనుమాన్ టెంపుల్ మీదుగా రాందాస్ చౌరస్తా వరకు కొనసాగింది.
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు, భయభ్రాంతులకు లోనుకాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. డీఎస్పీ ప్రసన్న కుమార్, టౌన్ సీఐ మహేశ్, రూరల్ సీఐ జార్జ్ పాల్గొన్నారు.
హుస్నాబాద్‌లో..
హుస్నాబాద్ లో శుక్రవారం ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో సుభాష్ నగర్, గోదాం గడ్డ, రెడ్డి కాలనీ మీదుగా మెయిన్ సెంటర్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ.. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సీఐ శ్రీను, ఎస్సైలు లక్ష్మారెడ్డి, అభిలాశ్ పాల్గొన్నారు.
