లావణ్య డ్రగ్స్ కేసులో ఉనిత్ రెడ్డి.. కదులుతున్న సినీ డొంక

లావణ్య డ్రగ్స్ కేసులో ఉనిత్ రెడ్డి.. కదులుతున్న సినీ డొంక

లావణ్య డ్రగ్స్ కేసులో మలుపులు తిరుగుతుంది. రిమాండ్ రిపోర్టులో కొత్త పేర్లు బయటకు వచ్చాయి. కొంత కాలంగా డ్రగ్స్ కు బానిస అయిన లావణ్య.. ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు వెల్లడించింది. జనవరి 29వ తేదీనే ఈ కేసులో జైలుకు వెళ్లిన లావణ్య.. విచారణలో పోలీసులకు వెల్లడించిన విషయాలు బయటకు వచ్చాయి. 

లావణ్యది విజయవాడ. సినిమా అవకాశాల కోసం.. మంచి జీవితం కోసం హైదరాబాద్ వచ్చింది. మంచి టాలెంట్ అయిన లావణ్య.. మ్యూజిక్ టీచర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. పెద్ద హీరోలతో ఛాన్స్ రాకపోయినా చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నది. కొన్ని షార్ట్ ఫిల్మ్ లలో హీరోయిన్ గా నటించింది. ఈ సమయంలో ఓ యంగ్ హీరోతో పరిచయం ప్రేమగా మారినట్లు చెబుతున్నది లావణ్య. ఆ యంగ్ హీరోతో ప్రేమ కారణంగా చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది లావణ్య. 

కొన్ని రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ అనుమానితురాలిగా ఉన్నది లావణ్య. సినీ ఇండస్ట్రీ పరిచయాలు, సినిమాల్లో బాగా ఎదగాలనే తపనతో డ్రగ్స్ కు అలవాటు పడినట్లు చెబుతున్నది లావణ్య. డ్రగ్స్ ను ఉనిత్ రెడ్డి ద్వారా తెప్పించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. లావణ్య చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ జల్లెడ పడుతున్నారు. కాంటాక్ట్ లో ఉన్న ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తున్నారు పోలీసులు. 

ప్రస్తుతం జైలులో ఉన్న లావణ్యను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలని నిర్ణయించారు పోలీసులు. ఆ తర్వాత ఎంత మంది బాగోతం బయటపడుతుంది.. సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ లింక్స్ ఎంత లోతుగా ఉన్నది అనేది తేలనుంది.