కండల కోసం స్టెరాయిడ్స్...అత్తాపూర్ లో భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం

కండల కోసం స్టెరాయిడ్స్...అత్తాపూర్ లో భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం

 జిమ్ కు వెళ్లి బాడీ పెంచుకుంటే చూడటానికి బాగుంటుందని యూత్ వెళ్తుంటారు. కొందరు ఫిట్ నెస్ కోసం, కొందరు మజిల్స్ కోసం జిమ్ కు వెళ్లటం సహజం. మరికొందరు బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనాలని కూడా వెళ్తుంటారు. ఇలాంటి యువకుల సహజమైన కోరికను ఆసరాగా చేసుకుని జిమ్ ట్రైనర్లు అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. శక్తికి అవసరమైన ఎనర్జీ ఫుడ్‍ (సప్లిమెంటరీ) పేరుతో మొదట్లో వివిధ రకాల పౌడర్లతో దందా మొదలుపెట్టి, ఆపై స్టెరాయిడ్స్  ఇస్తున్నారు. ఇందులో 3, 6 నెలల కోర్సులు అలవాటు చేస్తున్నారు. మళ్లీ అంతే కాలం మాములుగా ఉంటూ రెండు, మూడు, నాలుగు రౌండ్​లుగా కోర్స్​ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు.

జనవరి 26న హైదరాబాద్ అత్తాపూర్ లో  బాడీ బిల్డింగ్‌కు ఉపయోగించే స్టెరాయిడ్ ఇంజెక్షన్లను అక్రమంగా అమ్ముతోన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి  లక్షా 60 వేల విలువైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.  వేగంగా కండలు పెంచుకోవాలనే యూత్  ఆశను ఆసరాగా చేసుకున్న నిందితుడు   లైసెన్స్, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్నాడు.   సూరత్‌లోని ఇండియా మార్ట్ ద్వారా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు పోలీసుల ముందు  ఒప్పుకున్నాడు.     

జిమ్ లలో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్

సిటీలోని కొన్ని జిమ్​సెంటర్లలో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్​ వాడకం పెరుగుతోంది. ‘త్వరగా కండలు పెంచాలి.  ఇంప్రెస్​ చేయాలి’ అంటూ కొంతమంది యూత్​ స్టెరాయిడ్స్​వాడుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. కొంతమంది జిమ్​ ట్రైనర్లు, నిర్వాహకులు కూడా యూత్​ను తప్పుదోవ పట్టిస్తూ స్టెరాయిడ్స్​కు అలవాటు పడేలా చేస్తున్నారు. కేవలం మూడు, నాలుగు నెలల్లోనే బాడీ షేప్​మార్చేలా చేస్తామని, సిక్స్ ప్యాక్ తెప్పిస్తామని ప్రచారం చేసుకుంటూ వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. స్టెరాయిడ్ ఇంజెక్షన్ల దుర్వినియోగంతో యువతలో వ్యసనం, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని.. ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న స్టెరాయిడ్స్ ను కొనుగోలు వాడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.