సుబ్బారావును ఎందుకు విచారిస్తలే? 

సుబ్బారావును ఎందుకు విచారిస్తలే? 
  • సికింద్రాబాద్ ఘటనకు ప్రధాన సూత్రధారిగా అనుమానించిన పోలీసులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి ఘటనలో సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును ప్రధాన సూత్రధారిగా మొదట అనుమానించిన పోలీసులు... ఇప్పటి వరకు అతణ్ని విచారించలేదు. ప్రస్తుతం ఏపీ పోలీసుల అదుపులో ఉన్న అతణ్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన సుబ్బారావు రెండు రాష్ట్రాల్లోనూ అకాడమీలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టారని పోలీసులు గుర్తించారు. సెల్ఫీ ఫొటో, వాట్సాప్ చాటింగ్స్ కు సంబంధించి ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగా దాడి జరిగిన రోజే  సుబ్బారావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేటలోని పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీ పోలీసులను మన పోలీసులు సంప్రదించలేదు. సుబ్బారావు పేరుతో వాట్సాప్ చాటింగ్స్, సెల్ఫీ ఫొటో ఉన్నప్పటికీ ఆయనను ఎందుకు విచారించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆధారాలు దొరికినప్పటికీ, అనుమానితుడిగా గుర్తించినప్పటికీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులోనూ ఎక్కడా సుబ్బారావు పేరు లేదు. తెలంగాణకు చెందిన యువకులను మాత్రమే నిందితులుగా చూపారు. అటు రైల్వే పోలీసులు గానీ, ఇటు సిటీ పోలీసులు గానీ సుబ్బారావుకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. 

10 సెంటర్లు సుబ్బారావువే.. 

విధ్వంసంలో ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో మొత్తం 16 కోచింగ్ సెంటర్లకు చెందిన నిర్వాహకులు ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. వీటిలో 10 సుబ్బారావుకు చెందినవేనని గుర్తించారు. హైదరాబాద్‌‌‌‌లోని 6 కోచింగ్‌‌‌‌ సెంటర్లు, సుబ్బారావుకు చెందిన 10 సెంటర్ల మేనేజర్లు ఆర్మీ అభ్యర్థులను ప్రేరేపించినట్లు గుర్తించారు. 

జైలుకొచ్చిన తల్లిదండ్రులు

చంచల్ గూడ జైల్లో ఉన్న యువకులను కలిసేందుకు వారి కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున వచ్చారు. తమ పిల్లలతో మాట్లాడేందుకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ములాఖత్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 300 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, సోమవారం 15 మందికి అవకాశం ఇచ్చారు.

మమ్మల్ని సంప్రదించలే: పల్నాడు ఎస్పీ  

సికింద్రాబాద్‌‌‌‌ కేసులో తెలంగాణ పోలీసులు తమను సంప్రదించలేదని పల్నాడు ఎస్పీ రవిశంకర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి చెప్పారు. సుబ్బారావుపై ఆరోపణల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సుబ్బారావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు. ఆందోళనకు ప్రేరేపించినట్లు ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదన్నారు. కాగా, దర్యాప్తులో భాగంగా సుబ్బారావు అకాడమీల్లో ఏపీ పోలీసులు తనిఖీలు చేశారు. అభ్యర్థుల వివరాలతో కూడిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. 

మా వాడికి సంబంధం లేదు.. 

మాది సిద్దిపేట జిల్లా. నా కొడుకు గతంలో కోచింగ్‌‌‌‌కి వెళ్లాడు. శుక్రవారం ఉదయం సార్ రమ్మంటున్నాడని చెప్పి హైదరాబాద్ వచ్చాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలియదు. మొబైల్‌‌‌‌ స్విచ్ఛాఫ్ వచ్చింది. శనివారం పోలీసులు ఫోన్‌‌‌‌ చేసి నా కొడుకును అరెస్ట్ చేశామని చెప్పారు. మా వాడు దాడులకు పాల్పడే వాడు కాదు. సీసీటీవీ కెమెరాలు చూసి నిర్ధారించుకోవాలి.  
- చంచల్‌‌‌‌గూడ జైల్లో ఉన్న
 ఓ అభ్యర్థి తండ్రి