అన్నంలో మత్తు మందు కలిపి దోపిడీ చేసిన నేపాలీ గ్యాంగ్ కోసం పోలీసుల వేట

అన్నంలో మత్తు మందు కలిపి దోపిడీ చేసిన నేపాలీ గ్యాంగ్ కోసం పోలీసుల వేట

ఆస్పత్రి నుండి ఇంటికి చేరిన మధుసూధన్ రెడ్డి కుటుంబం

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో యజమాని కుటుంబానికి ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చి దోచుకున్న నేపాలీ గ్యాంగ్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. గ్యాంగ్ కోసం ఎనిమిది బృందాలు ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు టెక్నాలజీని ఉపయోగించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దోపిడీ జరిగి మూడు రోజులు అవుతున్నా  పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గచ్చిబౌలి బీఎన్‌ఆర్‌ హిల్స్‌లో తమకు ఆశ్రయం కల్పించిన యజమాని కుటుంబ సభ్యులందరికీ రాత్రి భోజనంలో మత్తు మందు పెట్టి మరీ దోపిడీ పాల్పడ్డారు. ఈ  నేపాలీ గ్యాంగ్ తెలివిగా సీసీ కెమెరాలను దోపిడీకి ముందే ధ్వంసం చేయడంతోపాటు.. డీవీఆర్ రికార్డర్లను వెంట తీసుకెళ్లారు. మత్తు ప్రభావంతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న మధుసూదన్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఆస్పత్రి నుండి  నిన్న డిశ్చార్జ్ చేశారు వైద్యులు. యజమాని కుటుంబ సభ్యులు తిరిగి రావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మొదట భావించిన దానికంటే అధిక మొత్తంలో దోపిడికి గురైనట్లు గుర్తించారు పోలీసులు. నిందితుల వివరాలు.. వారి సంబంధీకులను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ మాత్రం క్లూ లభించినా నిందితులను పట్టుకునేలా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు పోలీసులు. తొందర్లోనే నిందితుల ఆచూకీ తెలుసుకుంటామని.. వారు ఎక్కడున్నా పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.