రిమాండ్ లో మావోయిస్టు శ్రీవిద్య

రిమాండ్ లో మావోయిస్టు శ్రీవిద్య
  • హైకోర్టుకు వివరించిన పోలీసులు

హైదరాబాద్, వెలుగు: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నార్ల శ్రీవిద్యను తాము అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. ఆమెను ఈ నెల 25న మియాపూర్‌‌‌‌ కోర్టులో హాజరుపరిస్తే.. జడ్జి రిమాండ్‌‌‌‌ ఉత్తర్వులిచ్చారని, ఆమె జైల్లో ఉన్నారని పోలీసుల తరఫున రాష్ట్ర  ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్‌‌‌‌ ఊరిళ్ల వివరించారు. దీంతో ఆమె ఆచూకీ తెలియడం లేదని, ఆమె ప్రాణాలకు హాని ఉందంటూ దాఖలైన హేబియస్‌‌‌‌ కార్పస్‌‌‌‌ పిటిషన్‌‌‌‌పై విచారణను మూసివేస్తున్నట్టు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. 

పోలీసులు చెప్పిన విషయాన్ని రికార్డుల్లో నమోదు చేసిన హైకోర్టు.. శ్రీవిద్య తండ్రి నార్ల సుధాకర్‌‌‌‌ శర్మ దాఖలు చేసిన హెబియస్‌‌‌‌ కార్పస్‌‌‌‌ పిటిషన్‌‌‌‌పై విచారణను మూసివేస్తూ తుది ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌‌‌‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌‌‌‌ బి. మధుసూదన్‌‌‌‌ రావుల ద్విసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. తన కుమార్తెను మఫ్టీలోని పోలీసులు తీసుకెళ్లారని, ఆమె ప్రాణాలకు హాని ఉన్నందున వెంటనే కోర్టులో హాజరుపర్చేలా ఉత్తర్వులివ్వాలని పిటిషనర్‌‌‌‌ వాదన. 

దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. శ్రీవిద్యపై ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదైందని, ఆమెను ఈ నెల 25న మియాపూర్‌‌‌‌ కోర్టులో హాజరుపరిచామని, కోర్టు రిమాండ్‌‌‌‌కు తరలించాలని ఆదేశాలిచ్చిందని వివరించారు. అజ్ఞాతంలో ఉన్న 450 మంది మావోయిస్టులతో ప్రభుత్వం జాబితా రూపొందించిందని, 2012 నాటికి 350 మంది జాబితా ఉందని, వారికి రూ.5 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించిందని వివరించారు. జనజీవన స్రవంతిలో కలవాలని ప్రభుత్వం పిలుపునిచ్చిందన్నారు. దీనిపై పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ, కోర్టులో హాజరుపరచాలన్నదే తమ అభ్యర్థన అని గుర్తుచేశారు.