సర్టిఫికెట్లు లేట్ చేస్తున్నారని.. ఎమ్మార్వో ఆఫీసుకు తాళం

సర్టిఫికెట్లు లేట్ చేస్తున్నారని.. ఎమ్మార్వో ఆఫీసుకు తాళం

 కరీంనగర్, వెలుగు: సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం రామగుండం తహసీల్దార్‌‌ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఇటీవల ఇక్కడి తహసీల్దార్‌‌, డిప్యూటీ తహసీల్దార్‌‌ ఇద్దరూ బదిలీపై వెళ్లడంతో కార్యాలయంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. మీసేవలో దరఖాస్తు చేసిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేసే అధికారి లేకపోవడంతో వందలాది దరఖాస్తులు పెండింగ్‌‌లో ఉన్నాయని పేర్కొన్నారు. 

అడ్మిషన్ల సమయం కావడంతో సర్టిఫికెట్లు అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కార్యాలయానికి వస్తే ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదని తల్లిదండ్రులు మండిపడ్డారు. కార్యాలయానికి తాళం వేయడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. బాధ్యులైన అధికారులతో మాట్లాడి త్వరలోనే సర్టిఫికెట్ల జారీ జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం కార్యాలయానికి వేసిన తాళాలు తీసేశారు.