అన్నమయ్య జిల్లాలో చెడ్డి గ్యాంగ్ : హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు

అన్నమయ్య జిల్లాలో చెడ్డి గ్యాంగ్ : హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు

Cheddi Gang: అన్నమయ్య జిల్లాల్లో చెడ్డి గ్యాంగ్ తిరుగుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ హెచ్చరించింది. పీలేరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో హై అలర్ట్ ప్రకటించారు అన్నమయ్య జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి ఆదేశాల మేరకు రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పీలేరు పోలీసు సిబ్బంది అప్రమత్తమై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో నాకా బందీ: 
పీలేరు పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో నాకా బందీ నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు డీఎస్పీ కృష్ణ మోహన్. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి.. గుర్తింపు పత్రాలు, వాహనాల వివరాలను పరిశీలిస్తున్నట్లు వివరించారాయన. రాత్రి వేళల్లో పోలీసు పహారాను మరింత పెంచడంతో పాటు సున్నిత ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు డీఎస్పీ.  

చెడ్డి గ్యాంగ్ ఎంట్రీతో పోలీసుల అలర్ట్: 
చెడ్డి గ్యాంగ్ సంచరిస్తున్నట్లు సమాచారం రాగానే.. అప్రమత్తమయ్యి.. నాకాబందీ, వాహనాల తనిఖీ, కార్డన్ సెర్చ్‌లు నిరంతరం కొనసాగుతున్నామని డీఎస్పీ కృష్ణ మోహన్ వెల్లడించారు. ముందస్తుగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నామని.. జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారాయన. రాత్రి సమయాల్లో ఇళ్ల దగ్గర ఎవరైనా కొత్త వ్యక్తులు తిరుగుతున్నా.. అనుమానాస్పదంగా తిరుగుతున్నా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు డీఎస్పీ.

అనుమానం వస్తే డయల్ 112: 
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటంతోపాటు ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే డయల్–112కు సమాచారం అందించాలని కోరారు డీఎస్పీ. ప్రజల సహకారంతోనే నేరాల నివారణ మరింత సమర్థవంతంగా జరుగుతుందన్నారాయన. పోలీసుల ముమ్మర తనిఖీలతో పీలేరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వివరించారు డీఎస్పీ కృష్ణ మోహన్.