
పోలింగ్ సెంటర్ పరిసరాల్లో.. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసులు.. ఓవరాక్షన్ చేశారు. పరిషత్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఓ ఓటర్ తో… షర్ట్ విప్పించారు పోలీసులు. దీనిపై అక్కడ గందరగోళం ఏర్పడింది.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం.. బరాఖత్ గూడంలో ఈ సంఘటన జరిగింది. పోలింగ్ సెంటర్ కు ఓటరు రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకొచ్చాడు. ఎన్నికల్లో ఓటర్లు ప్రభావితం అవుతారంటూ… పోలీసులు అతడితో షర్ట్ విప్పించారు. బనియన్ పైనే పోలింగ్ బూత్ క్యూ లైన్ లో నిలబెట్టి.. ఓటు వేయమన్నారు. ఆ ఓటర్ కూడా అలాగే చేశాడు.
పోలీసుల తీరుపై.. అతని భార్య తీవ్రంగా మండిపడింది. ఎర్ర అంగీ వేసుకుని రావడం తప్పైతే… గేటు ముందే చెప్పాలి కానీ.. ఇక్కడదాకా వచ్చాక ఇలా అవమానిస్తారా అని పోలీసులను ప్రశ్నించింది. అందరూ వేసుకొస్తే అందరితో విప్పిస్తారా…? ఆడవాళ్లు ఎర్ర చీర కట్టుకొస్తే ఇక్కడే విప్పమంటారా … చెప్పండి.. అంటూ పోలీసులను నిలదీసింది. బరిబాతల వెళ్లి ఓటేయాలని నా భర్తను పంపించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆక్రోశంతో అడిగింది. చాలామంది రంగురంగుల బట్టలు వేసుకొచ్చారని… అందరినీ వదిలిపెట్టి తన భర్తనే అవమానించారని ఆమె పోలీసులను తిట్టిపోసింది.
గొడవ పెద్దది కావడంతో.. ఎన్నికల అధికారులు, స్థానిక గ్రామస్తులు వారికి సర్దిచెప్పి ఓటేయించారు.