కడప జిల్లా ఖాజీపేటలో విద్యార్థిని కీర్తన హత్య కేసు కీలక మలుపు తిరిగింది. పట్టపగలే గొంతుకోసి ఉన్మాదిలా ప్రవర్తించిన నిందితుడు వెంకటేష్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. మైదుకూరు-బద్వేల్ ప్రధాన రహదారిలోని బసాపురం చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
అగ్రహారం గ్రామానికి చెందిన కీర్తన అనే విద్యార్థినిని. ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ గొంతుకోసి కిరాతకంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమైన కీర్తనను చికిత్స నిమిత్తం కడపకు తరలిస్తుండగా.. ఆమె మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నిందితుడు.. ఇంతటి ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో భాగంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా బసాపురం చెక్ పోస్ట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వెంకటేష్ వారిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం పోలీసులు నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చింది.
నిందితుడి దాడిలో కొందరు పోలీసులకు గాయాలవగా.. వారిని వెంటనే మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు కాల్పుల్లో గాయపడిన నిందితుడి పరిస్థితిపై కూడా సమాచారం అందాల్సి ఉంది. అసలు ఈ హత్యకు గల కారణాలేంటి? నిందితుడు పోలీసులపై ఎందుకు దాడి చేశాడు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
