యడ్యూరప్ప కేసులో సంచలనాలు 53 మందిపై లైంగిక వేధింపుల కేసులు

యడ్యూరప్ప కేసులో సంచలనాలు 53 మందిపై లైంగిక వేధింపుల కేసులు

 గత కొన్ని రోజుల క్రితం కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే.. ఆ కేసులో కొత్తగా ఓ విషయం వెలుగు చూసింది. తన 17ఏళ్ల కూతురిని లైంగికంగా వేధించినట్లు 53 ఏళ్ల మహిళ యడ్యూరప్పపై కేసు నమోదు చేసింది. ఆమె ఇంతకుముందు 52 లైంగిక వేధింపుల కేసులు నమోదు చేసిందని పోలీసులు తెలిపారు. రాజకీయ నాయకులు, అధికారులను ఆ మహిళ కలుస్తుందని, ఫొటోలు, వీడియోలు తీసి ఆ తర్వాత వారిపై ఫిర్యాదు చేస్తుందని ఒక పోలీస్‌ అధికారి చెప్పారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత వీఎస్‌ ఉగ్రప్ప, ఇద్దరు మాజీ పోలీస్‌ కమిషనర్లైన భాస్కర్‌రావు, అలోక్‌కుమార్‌తో సహా పలువురిపై ఆమె ఇప్పటి వరకు 53 కేసులు పెట్టిందట. 

ఆ మహిళ తన భర్త,పొరుగువారిపై లైంగిక దాడి కేసులతోపాటు అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కమిటీకి వ్యతిరేకంగా పోలీస్‌ కమిషనర్, డీజీ, ఐజీ కార్యాలయాల్లో పలు ఫిర్యాదులు చేసినట్లు రికార్డుల ద్వారా తెలుస్తున్నదని వెల్లడించారు. అత్యాచారం కేసులో సహాయం కోరేందుకు మాజీ సీఎం యడ్యూరప్పను ఫిబ్రవరి 2న ఆయన నివాసంలో ఆ మహిళ కలిసింది. ఆ సమయంలో 17 ఏళ్ల తన కుమార్తెను యడ్యూరప్ప లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.