అడవిలో అక్రమంగా ఇసుక డంప్..సీజ్ చేసిన అధికారులు 

అడవిలో అక్రమంగా ఇసుక డంప్..సీజ్ చేసిన అధికారులు 

తాండూర్/షాద్​నగర్, వెలుగు: తాండూరు సబ్​డివిజన్ పెద్దేముల్ మండల పరిధిలోని మదనంతాపూర్ గ్రామ శివారు అడవిలో అక్రమంగా నిల్వ ఉంచిన ఎనిమిది ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రెవెన్యూ సిబ్బందితో కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఈ ఇసుక డంపులను సీజ్ చేసినట్లు పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

అలాగే రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామ శివారులో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అక్రమంగా మట్టి లోడ్​తో వెళ్తున్న రెండు ట్రాక్టర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. ఈ వాహనాలను పోలీస్ స్టేషన్‌‌కు తరలించి నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు