మణిపూర్​లో మళ్లీ కాల్పులు..

మణిపూర్​లో మళ్లీ కాల్పులు..

ఇంఫాల్ : కాంగ్రెస్ మాజీ చీఫ్​రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా మణిపూర్ లో గురువారం హైడ్రామా చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్తుండగా ఇంఫాల్​కు 20 కిలోమీటర్ల దూరంలోని బిష్ణుపూర్​లో రాహుల్​ కాన్వాయ్​ను పోలీసులు నిలిపివేశారు. అల్లర్లతో అట్టుడుకుతున్న చురాచాంద్​పూర్ జిల్లాలో రాహుల్ పర్యటించాల్సి ఉండగా సెక్యూరిటీ సమస్యలు వస్తాయని, గ్రనేడ్ దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు మార్గాన కాకుండా హెలికాప్టర్​లో వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో రాహుల్ గాంధీ వెనుదిరిగి ఇంఫాల్​కు వెళ్లి అక్కడనుంచి హెలికాప్టర్​లో చురాచాంద్​పూర్ చేరుకున్నారు.

రాహుల్ ప్రయాణించాలనుకున్న రోడ్డు మార్గంలో భారీ సంఖ్యలో మహిళలు ఆందోళన నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా కాన్వాయ్​ను రిక్వెస్ట్​ చేసి బిష్ణుపూర్​లో నిలిపివేశామని పోలీస్​అధికారి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​నేతలు మాట్లాడుతూ.. మహిళలు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారన్నారు. రాహుల్​గాంధీ చురాచాంద్​పూర్ జిల్లాలో అదేవిధంగా తమ గ్రామంలో పర్యటించాలని ఆందోళనకారులు కోరుకున్నారన్నారు. కాగా, మణిపూర్ బ్రదర్స్, సిస్టర్స్ ను కలవకుండా బీజేపీ ప్రభుత్వం తనను అడ్డుకుందని రాహుల్ గాంధీ ట్విట్టర్​లో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. హింసాత్మక ఘటనలతో సతమతమవుతున్న రాష్ర్ట ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నారు.  

మణిపూర్​లో మళ్లీ కాల్పులు

మణిపూర్​లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. గురువారం సాయుధ దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. కంపోక్పీ జిల్లా హరావ్​థెల్​గ్రామంలో కొంతమంది కాల్పులు జరిపారని ఇండియన్​ఆర్మీ ప్రతినిధులు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు సైనిక బలగాలను ఆ ప్రాంతానికి తరలించామని తెలిపారు. గురువారం ఉదయం 5.30 సమయంలో ఆయుధాలతో వచ్చిన కొంతమంది గ్రామంపై కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందిందన్నారు. ఈ ఏడాది మే నుంచి గిరిజన కమ్యూనిటీల మధ్య జరుగుతున్న హింసాత్మక దాడుల్లో మణిపూర్​అతలాకుతలం అవుతోంది. ఈనేపథ్యంలో రాష్ర్టవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న 300 రిలీఫ్​ క్యాంపుల్లో సుమారు 50వేలమంది ఆశ్రయం పొందుతున్నారు. ఘర్షణల్లో ఇప్పటివరకు 100మందికి పైగా మృతిచెందారు.