సెక్రటేరియట్ దగ్గర రేవంత్ను అడ్డుకున్న పోలీసులు

సెక్రటేరియట్ దగ్గర రేవంత్ను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్ లోని టెలిఫోన్ భవన్  దగ్గర టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.  సెక్రటేరియట్ విజిటర్స్ గేట్లు  మూసివేసిన పోలీసులు సెక్రటేరియట్  గేట్ల దగ్గర  భారీకేడ్లు పెట్టారు.  ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నట్లు రేవంత్ చెప్పాగా  అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. కాసేపు పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. తాను ఎంపీనని ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. ప్రజాప్రతినిధులకు అనుమతి ఎందుకని ప్రశ్నించారు రేవంత్.  అయితే అనుమతి లేనిది లోపలికి వెళ్లనివ్వబోమని పోలీసులు అడ్డుకున్నారు.

ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ వ్యక్తులకు లీజు వెనుక భారీ అవినీతి జరిగిందని  ఇటీవల  రేవంత్ రెడ్డి ఆరోపించారు.  ఔటర్ రింగ్  రోడ్డును 30 ఏళ్ల  పాటు లీజుకిస్తే దాదాపు  30 వేల కోట్ల ఆదాయం వస్తదన్నారు. అయితే ముంబైకి చెందిన  ఐఆర్ బీ లిమిటెడ్  అనే   సంస్థకు  7380 కోట్లకే కేసీఆర్  తాకట్టు పెట్టారని ఆరోపించారు. నాలుగైదు నెలల్లో దిగిపోయే కేసీఆర్ కు  ఔటర్ రింగ్ రోడ్డును లీజుకి  ఇవ్వాల్సిన  అవసరం  ఏముందని ప్రశ్నించారు.  

 ఔటర్ రింగ్ రోడ్డు లీజులో దాదాపు 1000 కోట్లకుపైగా చేతులు మారినట్లు సమాచారం ఉందన్నారు రేవంత్. ఇది దేశంలోనే పెద్ద స్కాం అని.. దీని వెనకాల మాజీ  సీఎస్ సోమేష్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్   అర్వింద్ కుమార్ ఉన్నారని ఆరోపించారు.  కేటీఆర్ తో కలిసి ఈ దోపిడికి పాల్పడ్డారన్నారు.  సోమేశ్ కుమార్, అర్వింద్ కుమార్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు రేవంత్. ఈ ఇద్దరు అధికారులు తీసుకున్న నిర్ణయాలను.. లావాదేవీలపై అధికారంలోకి రాగానే  కాంగ్రెస్ సమీక్షిస్తుందన్నారు.