బోడుప్పల్ వక్ఫ్ బోర్డు బాధితుల దీక్ష భగ్నం

బోడుప్పల్ వక్ఫ్ బోర్డు బాధితుల దీక్ష భగ్నం

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బోడుప్పల్ లో తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వక్ఫ్ బోర్డు నుండి తమ భూములను తొలగించాలన్న డిమాండ్ తో వక్ఫ్ బోర్డు బాధితులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.  బాధితులు ఈ నెల 18 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో ఈ రోజు తెల్లవారుజామున ఇద్దరికి షుగర్ లెవెల్స్ పడిపోయాయి. దీంతో వారిని  హుటాహుటిన గాంధీ హస్పిటల్ , మరికొందరిని బోడుప్పల్ అభయ హస్పిటల్ కు తరలించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో వక్ఫ్ బోర్డు నుండి తమ ఇళ్ల స్థలాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ యాభై రెండు రోజులుగా వివిధ రకాలుగా ఏడు వేల కుటుంబాలు నిరసనలు చేస్తున్నాయి. ప్రభుత్వం దిగి రాకపోవడంతో రెండు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష కు దిగాయి.

మరోవైపు చట్టబద్ధమైన అన్ని పత్రాలూ కలిగి ఉండి, ఎప్పటి నుంచో అక్కడే నివసిస్తున్నప్పటికీ తమ ఆస్తులపై తమకు హక్కు లేదన్న ప్రభుత్వ వాదనకు వక్ఫ్ బోర్డు బాదితులు  18న నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాయి.  ఈ సందర్భంగా  అందరి ఆస్తులకూ ఉన్నట్టే తమకూ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని బాధితులు తెలిపారు. ఎల్ఆర్ఎస్ లు, మున్సిపల్ పర్మిషన్లు, ఇంటి నెంబర్లు, పట్టాదార్ పాస్ పుస్తకాల వంటివన్నీ ఉన్నాయని చెప్పారు. కానీ  రోడ్డు, డ్రైనేజ్, కరెంట్, తాగునీరు వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. ఇవన్నీ ఉన్నా కూడా 2018 నుంచి తమ ఆస్తిపై తమకే హక్కు లేదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం  తమ భూములను వక్ఫ్ భూములుగా చిత్రకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.  మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా ఘట్కేసర్లో 2016లో వేసిన హెచ్ఎండీఏ లేఔట్ ని కూడా 2019 నుంచి వక్ఫ్ భూములుగా ప్రకటించారన్నారు. బోడుప్పల్ పరిధిలో ఇంకా 3వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయని అసెంబ్లీలో ప్రకటించారని విమర్శించారు. ఈ నేపథ్యంలో తమకు జరుగుతున్న అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో ఆమరణ దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు.