‘ఉరుము ఉరిమి మంగళం మీద పడింది’ అన్నట్టు రాష్ట్ర విభజనపై బీజేపీ యువ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టించాయి. సందర్భశుద్ధిలేని వాగుడు పార్టీకి కీడే చేస్తోంది. ‘బ్రిటిష్ హయాంలో భారత్ - పాక్‌ను విడగొట్టడం కన్నా దారుణంగా తెలంగాణ- ఆంధ్రను విభజించారు’ అని సూర్య అనటం బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టింది. సుదీర్ఘపోరుతో రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజల మనోభావాలు నొచ్చుకునేలా బీజేపీ జాతీయ నాయకత్వం నోరు పారేసుకోవటం ఇది మొదటిసారేం కాదు! ఇలాంటి వ్యాఖ్యలే బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ చేసినపుడు కూడా ప్రత్యర్థి పక్షాలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఒంటికాలిపై లేచాయి.
నిజానికి బీజేపీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీయేం కాదు. ప్రత్యేక రాష్ట్రసాధన పోరులో సుదీర్ఘ చరిత్ర ఉండి, ముందు వరుసలో నిలిచి, నిబద్ధత చాటి.. ఇప్పుడిలా నిర్హేతుక నిందలు మోయాల్సిరావటం రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఇరుకున పడేస్తోంది. ఇది వారి వైఫల్య ఫలితమే! ఎప్పటికప్పుడు క్షేత్ర సమాచారం, తెలంగాణ జన మనోభావాలు తెలిపి తమ జాతీయ నేతల నోరు అదుపు చేయడంలో వైఫల్యమే ఇందుక్కారణం. చెరిపేస్తే చెరగనిది చరిత్ర!
ఇది కథాకథనాల (న్యారేటివ్స్) శకం. రాజకీయ సిద్ధాంతాల కన్నా, చేసిన పనుల కన్నా, సమర్థంగా చెప్పుకునే కథనాలు- పకడ్బందీగా చేసుకునే ప్రచారాలతో ప్రజాభిప్రాయాల్ని సానుకూలంగా మలుచుకుంటున్న చిత్రమైన కాలమిది. జనంలోకి బలంగా చొచ్చుకుపోయే గట్టి ‘న్యారేటివ్స్’ అధికారాన్ని అందించడమే కాదు సుస్థిరం చేస్తున్నాయి. అటువంటి చోట...‘నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుంది’అనే పాత సామెత గుర్తురాక మానదు!
కొంచెం అటు ఇటుగా అన్ని రాజకీయ పార్టీలదీ ఇదే పంథా! పకడ్భందీ ‘న్యారేటివ్స్’తోనే ప్రత్యర్థులపై పుష్కరకాలంగా ఆధిపత్యం సాధిస్తున్న బీజేపీ నాయకత్వం తెలంగాణ విషయంలో పొరపాటు చేస్తోంది. తరచూ ‘నోరు’ జారుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర వాదన విషయంలో అందరికన్నా ముందే గొంతెత్తి, విధాన ప్రకటన కూడా చేసిన బీజేపీ 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడుగానీ, తదనంతర కాలంలోగానీ అందుకు సమానస్థాయిలో రాజకీయ లబ్ధి పొందలేదు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి!
తెలంగాణలో అవకాశం ఉండి ఎదగలేని దుస్థితి
ముఖ్యంగా తెలంగాణలో అవకాశం ఉండీ ఆశించిన స్థాయిలో ఎదగలేని దుస్థితి బీజేపీది! ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను విమర్శించే ఒకే ఒక ఉద్దేశ్యంతో, ఎందరో ప్రాణ త్యాగాలతో దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ మనోభావాలను కించపరిచేవిధంగా విభజనపై వ్యాఖ్యలు చేస్తున్నారు. విభజన అన్యాయంగా, అప్రజాస్వామికంగా జరిగిందనే భావనను పదేపదే వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వంటి నాయకుడే ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అని చేసిన వ్యాఖ్యలు సగటు తెలంగాణవాదిని లోతుగా నొప్పించాయి.
మోదీ వేర్వేరు సందర్భాల్లో ‘విభజనతో సీమాంధ్ర ప్రాంతాన్ని కాంగ్రెస్ అనాథగా మార్చింది’ (గుల్బర్గ), ‘తల్లి నుంచి బిడ్డను వేరు చేశారు’ (తిరుపతి), ‘ఎన్నికల్లో లబ్ధికోసం పార్లమెంటు తలుపులుమూసి ఏపీని విభజించారు. రాజకీయ స్వార్థంతో హడావుడి నిర్ణయం తీసుకున్నారు’ (పార్లమెంటులో) ఇటువంటి వ్యాఖ్యల చేయాల్సిన అవసరమే లేదు. ఆ వరుసలోవే పార్టీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంటు వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు. కనీసం సందర్భశుద్ధి కూడా లేకుండా పలికే ఇటువంటి మాటలతో తెలంగాణ మనోభావాలను ఇంకా నొప్పిస్తూనే ఉన్నారు.
పోషించిన పాత్రను కాదనగలరా ?
‘అడుసు తొక్కనేల కాలు కడుగనేల?’ అనే సామెత ఎరుగనట్టు తేజస్వీ సూర్య వ్యాఖ్యలకు వివరణగా బీజేపీ రాష్ట్ర నాయకులు వ్యాఖ్యానాలు, ఉప వ్యాఖ్యానాలు చెబుతున్నారు. ‘ఆయన ఉద్దేశ్యం అది కాదు’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటుంటే, ‘సూర్య మాటలకు విపరీతార్థాలు తీయొద్దు’ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు వేడుకుంటున్నారు. అటువంటి అనుచిత మాటలు అసలు ఎందుకు అనాలి? సాధారణ జనానికి అర్థమయ్యేది కాకుండా నిగూఢమైన భావనేదో లోలోపల ఉన్నట్టు సదరు ‘వాగుడు’కు భాష్యం, అర్థం, అన్వయం ఎందుకు చెప్పాలి? అందువల్ల ప్రయోజనమేమిటి? దానికి బదులు, ముందుగానే తమ జాతీయ నాయకత్వానికి తెలంగాణ సున్నితత్వాన్ని, ఇక్కడి జనం మనోభావాలను వివరించాలి. కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో విభజనపై విపరీతార్థాలు తీస్తూ మాట్లాడటం సమంజసం కాదు అని తెలంగాణ బీజేపీ నాయకత్వం అధినాయకత్వానికి ఇదివరకే వివరించి ఉండాల్సింది.
ప్రధాని మోదీ లోగడ వ్యాఖ్యలు చేసినపుడే రాష్ట్ర బీజేపీ నేతలు క్షేత్ర స్పందనల్ని తెలియపరచి, మరెవరూ ఇకపై అలా మాట్లాడకుండా కట్టడిచేసి ఉండాల్సింది. ఎందుకంటే, అప్పుడు అధికారంలో లేకపోయినా బీజేపీకి విభజనలో పాత్ర ఉంది. తెలంగాణ ప్రజల సుదీర్ఘకాలపు కోరికయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తమది కీలక పాత్ర అని బీజేపీ నాయకత్వం ఎన్నో వేదికల నుంచి చెప్పుకుంది.
బీజేపీ ఆనాటి పార్లమెంటరీ పార్టీ నేత సుష్మాస్వరాజ్ (చిన్నమ్మ) కీలక భూమిక పోషించారని, ‘చిన్నమ్మ సహకారమే లేకుంటే రాష్ట్రమే వచ్చి ఉండేది కాదు’ అని వారే చెబుతారు. రాష్ట్రం ఏర్పాటు, విధివిధానాలు, విభజన చట్టంలో పొందుపరిచే అంశాల విషయంలో పార్టీ సీనియర్ నాయకుడైన వెంకయ్య నాయుడు పాత్ర, ప్రమేయాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
లేని వ్యతిరేకత ఎందుకు?
‘ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి’ సామెత చందంగా ‘తెలంగాణ’ విషయంలో ఈ రోజు బీఆర్ఎస్‌తో తిట్టించుకునే పరిస్థితిని బీజేపీ ఎదుర్కోవాల్సి వస్తోంది. అది వేరెవరి మాటల వల్లో! నిజానికి ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల కాకినాడ సదస్సులో 1997లోనే తీర్మానం ఆమోదించారు. కాంగ్రెస్ మేల్కొనడానికి, టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందే ‘రాష్ట్ర విభజన జరగాల్సిందే’అని ఒక స్పష్టతతో బీజేపీ గొంతెత్తిన చరిత్ర ఉంది. 1997 ఆగస్టులో పార్టీ విద్యార్థి విభాగం (ఏబీవీపీ) రాష్ట్ర కార్యవర్గం నెల్లూరులో సమావేశమైనపుడు రాష్ట్ర విభజన జరగాలని, తెలంగాణ ఏర్పడాలనీ కోరింది.
ఈ అన్ని దశల్లోనూ పార్టీకి, అనుబంధ విభాగాలు వెల్లడించిన భావజాలానికి ఆర్ఎస్‌ఎస్ గట్టి మద్దతుదారుగా ఉండేది. ఇంకా వెనక్కి వెళితే 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమకాలంలోనే ఏబీవీపీ నిజాం కాలేజీలో సమావేశమై ‘ఏ రక్షణ చర్యలు సరిపోవు, విడిపోవడమే పరిష్కారం’ అని నినదించింది. పాలనా సౌలభ్యం కోసమే కాక సుదీర్ఘ పోరాటాలకు రాజకీయ పరిష్కారం అని వాజ్‌పేయి ప్రధానిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ మూడు ప్రత్యేక రాష్ట్రాలను 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసింది.
బండారు దత్తాత్రేయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నపుడు సీహెచ్ విద్యాసాగరరావు అధ్యక్షతన ‘తెలంగాణ ఉద్యమ కమిటీ’ ఏర్పడి పనిచేసింది. 2009 ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చిన పార్టీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ ‘మాకు అధికారం ఇవ్వండి, వంద రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తాం’ అని హామీ ఇచ్చారు. ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 2012లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణ కోసం ‘పోరు యాత్ర’ జరిపారు. ఇదంతా చెరిగిపోని చరిత్ర. ప్రత్యర్థిని తక్కువ చేయడం ద్వారానో, వారి హయాంలో తప్పు జరిగిందని ఆరోపించడం ద్వారానో రాజకీయ లబ్ధికోసం పాకులాడుతూ రాష్ట్ర విభజనపై బీజేపీ చేసే అనుచిత, అసమంజస వ్యాఖ్యలు సరికాదనే భావన తెలంగాణవాదులు వ్యక్తం చేస్తున్నారు.
మనసు గెలిస్తేనే..
‘నోటితో పొగిడి నొసటితో వెక్కిరిస్తేనే’ సమస్య! దశాబ్దాల తెలంగాణ ఉద్యమాల్లో భాగమై, చివరి ఘట్టంలో రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ)లోనూ భాగమైన బీజేపీ, రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయంగా ఆ మేర లబ్ధి పొందలేదు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ (పూర్వపు టీఆర్ఎస్), ప్రస్తుతం కాంగ్రెస్ అధికారం చేపట్టాయి. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టు తయారయింది. లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు యాభైశాతం స్థానాలు గెలిచి రికార్డు సృ ష్టించారు.
‘ఈసారి అధికారంలోకి వచ్చేది మేమే’ అన్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండంకెలకు చేరలేదు. స్థానికసంస్థల ఎన్నికల్లోనూ ఫలితాలు అధ్వానమే! రాష్ట్రంలో పార్టీది ఇదీ పరిస్థితి. రాష్ట్ర విభజన ఒక చారిత్రక అవసరమని భావిస్తున్న తెలంగాణ సగటు పౌరుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు సముచితం కాదనే తెలివి పార్టీ అన్నిస్థాయిల నాయకుల్లో రావాలి. తద్వారా తెలంగాణ ప్రజల మనసు గెలిస్తేనే రాష్ట్రంలో బీజేపీకి మనుగడ, ఎదుగుదల సాధ్యం.
దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
* రచన 700 పదాలకు మించరాదు.

