రాజకీయ, ఆర్థిక ప్రజాస్వామ్యం రావాలి : సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

రాజకీయ, ఆర్థిక ప్రజాస్వామ్యం రావాలి :  సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి
  •     సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: దేశంలో రాజకీయ, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని రావాలని, అప్పుడే రాజ్యాంగ ఆశయాలు నెరవేరుతాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆర్థిక సంస్కరణలు, భారత రాజ్యాంగం – విభేదాలు, భవిష్యత్ దిశ అనే అంశంపై డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అర్ధశాస్త్ర విభాగం, చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

అంబేద్కర్ రాజ్యాంగ రూపశిల్పి మాత్రమే కాదని, ఆయన ఒక విశిష్టమైన ఆర్థికవేత్త అని కొనియాడారు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న సమానత్వం, న్యాయం వంటి అంశాల్లో సామ్యవాద స్ఫూర్తి అంతర్లీనంగా ఉందన్నారు. జమీందారీ వ్యవస్థ రద్దు, వ్యవసాయ పోరాటాలు సమానత్వం వైపు పడిన అడుగులని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫాసిజం కొత్త రూపాల్లో పుట్టుకురావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 

ఒక్క శాతం మంది వద్దే సంపద  

జేఎన్‌యూ ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయని, సంపదలో మెజారిటీ వాటా కేవలం ఒక్క శాతం మంది అగ్రవర్ణ ధనవంతుల వద్దే కేంద్రీకృతమైందన్నారు. సంపద పన్ను, వారసత్వ పన్ను వంటివి పకడ్బందీగా అమలు చేస్తేనే భారత్ సంక్షేమ రాజ్యంగా మారుతుందని చెప్పారు. 

ఓపెన్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల పెరుగుదలతో ఉన్నత విద్య పేదలకు అందకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూజీసీ నుంచి ప్రభుత్వ సంస్థలకు నిధుల కేటాయింపు తగ్గడం సరికాదన్నారు. ఓపెన్ వర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ పుష్పా చక్రపాణి, సెమినార్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఎకనామిక్స్ హెడ్  కృష్ణారెడ్డి, చంచల్‌గూడ డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ నాగోజీ తదితరులు పాల్గొన్నారు.