మున్సిపల్ ఎన్నికల్లో నోట్ల మోత..సర్వే అనుకూలంగా ఉన్నా.. సొమ్ముంటేనే ‘బీ-ఫారం’!

మున్సిపల్ ఎన్నికల్లో నోట్ల మోత..సర్వే అనుకూలంగా ఉన్నా.. సొమ్ముంటేనే ‘బీ-ఫారం’!
  • సర్వే అనుకూలంగా ఉన్నా.. సొమ్ముంటేనే ‘బీ-ఫారం’!
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని  మున్సిపాలిటీల్లో టికెట్ల లొల్లి
  • మేయర్ పదవికి రూ. 10కోట్ల నుంచి 15 కోట్లు?
  • మున్సిపల్​ చైర్మన్​కు కనీసం రూ. 2కోట్లు 
  • కౌన్సిలర్, కార్పొరేటర్​కు రూ. 20 కోట్ల నుంచి రూ. 30లక్షలు
  • రేపు మధ్యాహ్నమే డెడ్ లైన్.. ఆశావహుల్లో టెన్షన్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులకు ప్రస్తుతం సర్వే భయం పట్టుకుంది. క్షేత్రస్థాయిలో ప్రజల ఆదరణ ఉన్నప్పటికీ భారీ మొత్తంలో నిధులు సమకూర్చగల వారికే బీ-ఫారాలు దక్కుతాయనే ప్రచారం జోరందుకుంది. సర్వేల్లో పేర్లు ఉన్నా.. చేతిలో సరిపడా డబ్బు లేకపోవడంతో గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులు కూడా ప్రస్తుతం అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

మేయర్, చైర్మన్ పదవులకు డిమాండ్..

మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, చైర్మన్ పదవులకు  డిమాండ్ ఉంది. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్‌లో మేయర్ పీఠం హాట్ కేక్‌లా మారింది. ఈ పదవి ఎస్టీ రిజర్వ్ అయినప్పటికీ, పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. మేయర్ టికెట్ కావాలంటే కనీసం రూ. 10 నుంచి 15 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీలుచెప్తున్నాయని ప్రచారం జరగుతోంది.ఇల్లెందు, అశ్వారావుపేట చైర్మన్ పదవులకు సైతం రూ. 2 నుంచి 3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 

కేవలం ఉన్నత పదవులే కాకుండా, కార్పొరేటర్, కౌన్సిలర్ టికెట్ల కోసం కూడా భారీగానే డిపాజిట్లు చూపించాల్సి వస్తోంది. ఒక డివిజన్ నుంచి పోటీ చేయాలంటే రూ. 20 నుంచి 30 లక్షల వరకు నగదు నిల్వలు ఉండాలని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. డబ్బులు లేని సీనియర్​ కార్యకర్తకు టికెట్​ దక్కే అవకాశం లేదని అంటున్నారు. జనాదరణను కాదని, కేవలం ఆర్థిక స్తోమతకే పెద్దపీట వేయడంపై మాజీ ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

టికెట్ల కేటాయింపులో పార్టీలు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. గెలిచే సత్తా ఉన్న ఇద్దరిని ప్రతీ వార్డు లేదా డివిజన్ నుంచి సర్వేల ద్వారా గెలిచే అవకాశం ఉన్న ఇద్దరిని ఎంపిక చేసి, వారిలో ఎవరు ఆర్థికంగా బలంగా ఉంటారో వారికే బీ-ఫారం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రహస్య సర్వేలు పూర్తి చేసిన అధిష్టానాలు, అభ్యర్థుల నుంచి ఆర్ధిక హామీలను తీసుకుంటున్నాయి. సర్వేలో పేరున్నా, పార్టీ అడిగినంత డబ్బులు చూపించలేక పలువురు రేసు నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడింది. 

బీ-ఫారాల పంపిణీ.. ఆశావహుల్లో టెన్షన్ 

ఇక బీ-ఫారాల పంపిణీకి మంగళవారం మధ్యాహ్నం వరకు మాత్రమే గడువు ఉండటంతో ఆశావహుల్లో టెన్షన్ పీక్స్‌ కు చేరింది. ఆదివారం రాత్రి వరకు కూడా ప్రధాన పార్టీలు ఎవరికీ అధికారికంగా బీ-ఫారాలు అందజేయలేదు. నామినేషన్లు వేసిన వారు సైతం చివరి నిమిషంలో తమకు అవకాశం దక్కుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తుండటంతో, చివరి గంటల్లో ఏయే సమీకరణాలు మారి ఎవరికి టికెట్ దక్కుతుందోనన్న ఉత్కంఠ జిల్లా రాజకీయాల్లో నెలకొంది.