రాజకీయ నాయకుల భాష మారాలి ...శాసనమండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి

రాజకీయ నాయకుల భాష మారాలి ...శాసనమండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి
  • ఉచితాలను కట్టడి చేసి ఉపాధి కల్పించాలె

నల్గొండ అర్బన్, వెలుగు : రాజకీయ పార్టీలు ఉచితాలను కట్టడి చేసి.. ప్రజలకు పని కల్పించే చర్యలు చేపట్టాలని శాసనమండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి సూచించారు. నల్గొండలోని క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఉచితాల కారణంగా రాష్ట్రాల ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందన్నారు. ఎన్నికల టైంలో రాజకీయ నాయకుల ఉచిత హామీలు ఇవ్వకుండా కట్టడి చేసేందుకు సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్‌‌ చర్యలు తీసుకోవాలన్నారు. 

ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీల నాయకుల భాష సరిగ్గా లేదని, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. లీడర్లు భాషను మార్చుకోవాలని సూచించారు. భాష వాడకంపై ప్రతి నాయకుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు అవినీతి పెరిగిపోతోందని, ఎన్నికల ఖర్చులపై నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణమన్నారు.

 అవినీతిని కట్టడి చేయడంలో రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యోగులు భాగస్వాములు కావాలన్నారు. అవినీతి కారణంగా భవిష్యత్‌‌తరాలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఉమ్మడి ఏపీలో మద్రాస్‌‌కు నీళ్లు తీసుకుపోయేందుకు ప్రాజెక్ట్‌‌ అనుసంధానం జరిగిందని, ఇచ్చంపల్లి నుంచి సాగర్‌‌కు నీళ్లు తీసుకువస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. 

పెద్దల సభ గౌరవం తగ్గించేలా వ్యవహరించొద్దని ఎమ్మెల్సీలు తీన్మార్‌‌ మల్లన్న, కవితకు సూచించారు. సాగర్‌‌ ఎడమ కాల్వ, ఏఎంఆర్పీ కాల్వలకు నీటిని ముందుగానే విడుదల చేయడం పట్ల సీఎం రేవంత్‌‌రెడ్డి, ఇరిగేషన్‌‌ శాఖ మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.