తిరువనంతపురం/గువహటి/పుదుచ్చేరి: కేరళ, అస్సాంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. గురువారం (ఏప్రిల్ 9) ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. విలువైన ఓటు హక్కును వినయోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించినట్లు అధికారులు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు సులభంగా ఓటు వేసేందుకు వీలుగా వలంటీర్లను నియమించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీల్‌చైర్లు అందుబాటులో ఉంచామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా బలగాలను మోహరించారు.
కేరళలో 2.71 కోట్ల మంది ఓటర్లు
రాష్ట్రంలోని మొత్తం 140 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు అటు అధికార ఎల్‌డీఎఫ్ కు, ఇటు ప్రతిపక్ష యూడీఎఫ్ కు, ఉనికి కోసం పోరాడుతున్న ఎన్డీఏకు అత్యంత కీలకంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 2.71 కోట్లు మంది ఉండగా.. వీరిలో పురుషులు 1.32 కోట్లు, మహిళలు1.39 కోట్లు, ట్రాన్స్‌జెండర్లు 273 మంది, ప్రవాస ఓటర్లు 2.42 లక్షల మందికి పైగా ఉన్నారు. 883 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. 30,945 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
హ్యాట్రిక్‌పై పినరయి విజయన్ ధీమా
సీఎం పినరయి విజయన్ నాయకత్వంలోని వామపక్ష కూటమి ఈసారి హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. సాధారణంగా కేరళలో ప్రతీ ఐదేండ్లకు ప్రభుత్వం మారుతుంటుంది, కానీ గతసారి ఈ ఆనవాయితీని బ్రేక్ చేసిన విజయన్ ఈసారి కూడా తమ పదేండ్ల అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది.
ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, పాలనా వైఫల్యాలను ప్రధానాంశాలుగా చేసుకొని ప్రచారం నిర్వహించింది. రాహుల్, ప్రియాంక గాంధీ వంటి అగ్రనేతలు ఇక్కడ విస్తృతంగా పర్యటించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఈసారి కేరళ అసెంబ్లీలో ఖాతా తెరవడమే లక్ష్యంగా పెట్టుకుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌లో సాధించిన విజయం వారికి కొండంత బలాన్నిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి నేతలు రంగంలోకి దిగి ప్రచారం చేశారు.
పుదుచ్చేరిలో 9.50 లక్షల మంది..
పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 294 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. 9.50 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం1,099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో 209 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈసారి 24,919 మంది కొత్త ఓటర్లు ఓటు వేయనున్నారు.
ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు తొలిసారిగా డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా ఇప్పటివరకు రూ.77.25 లక్షలతో పాటు రూ.68.50 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై 17 కేసులు, ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలపై 24 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
రెండు కూటముల మధ్య పోటీ
ఏఐఎన్ఆర్సీ, బీజేపీ, అన్నాడీఎంకే, ఎల్జేకే కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఇక, కాంగ్రెస్, డీఎంకే, వీసీకే కూటమి స్థానిక స్వయంప్రతిపత్తి నినాదంతో తమ అభ్యర్థులను పోటీకి దింపాయి. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ మూడో ప్రధాన శక్తిగా అవతరించి, అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. వీరితోపాటు సీపీఐ, సీపీఐ(ఎం), నామ్ తమిళర్ కట్చి, స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ప్రస్తుత సీఎం, ఏఐఎన్ఆర్సీ నేత ఎన్.రంగసామి తట్టాంచావిడి. మంగళం నియోజకవర్గాల నుంచి పోటీలో ఉన్నారు.
అస్సాంలో 2.50 కోట్ల మంది..
అస్సాం రాష్ట్రంలోని 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి హ్యాట్రిక్ విజయంపై కన్నేయగా, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 2.50 కోట్ల మంది ఓటర్లు కాగా.. వీరిలో1.25 కోట్ల మంది మహిళలు ఉన్నారు.
మొత్తం 722 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. 31,490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీఎం హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్, ప్రతిపక్ష నేత దేవబ్రత సైకియా, ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్, రైజోర్ దళ్ నేత అఖిల్ గొగోయ్ వంటి హేమాహేమీలు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కాగా, కాంగ్రెస్ 99, బీజేపీ 90, ఏఐయూడీఎఫ్ 30, ఏజీపీ 26, బీపీఎఫ్ 11 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపాయి. మహిళా అభ్యర్థులు 59 మంది కాంగ్రెస్ నుంచి 14, బీజేపీ నుంచి ఏడుగురు పోటీలో ఉన్నారు.
హిమంత ఆరోసారి.. గౌరవ్‌గొగోయ్ తొలిసారి
జలుక్బారి నియోజకవర్గం నుంచి సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోసారి విజయం కోసం కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్‌తో తలపడుతున్నారు. జోర్హాట్ నుంచి కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామితో పోటీ పడుతున్నారు. శివసాగర్ నియోజకవర్గం నుంచి రైజోర్ దళ్ నేత అఖిల్ గొగోయ్ త్రిముఖ పోటీని ఎదుర్కొంటున్నారు.
