సత్తుపల్లి, వెలుగు : తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, సత్తుపల్లి నియోజకవర్గానికి 3500 ఇళ్లు అందించామని రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు, కాంగ్రెస్ నాయకులతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. బస్టాండ్ రింగ్ సెంటర్‌లో మాట్లాడిన మంత్రి... ప్రతిపక్షం పగటి కలలు కంటూ మాయమాటలు చెబుతోందని, పదేళ్ల పాలనలో ప్రజలను మోసం చేసిన వారిని ఓడించిన ప్రజలు మళ్లీ మోసపోరని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఒక విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరిగిందని, మిగిలిన మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేదవారికీ ఇల్లు అందిస్తామని ప్రకటించారు. రైతు రుణమాఫీ, ధాన్యం బోనస్, సన్న బియ్యం, ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సత్తుపల్లి అభివృద్ధికి ఇప్పటికే సహకరించామని, త్వరలో రూ.25 కోట్ల నిధులు అందుతాయని చెప్పారు. సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో అన్ని వార్డులు, ఖమ్మం జిల్లాలో 8కి 8 మున్సిపాలిటీలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సత్తుపల్లిలో 23 అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తూ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల అవాకులు చవాకులను ఖండించారు. 4500 కొత్త రేషన్ కార్డులు, 3500 ఇందిరమ్మ ఇళ్లు, ఆయిల్ ఫెడ్ కర్మాగారం, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు సాధించిన విజయాలని పేర్కొన్నారు.
