రాజగోపాల్ రెడ్డి ఇంటికి పొంగులేటి, జూపల్లి

రాజగోపాల్ రెడ్డి ఇంటికి పొంగులేటి, జూపల్లి
  • కాంగ్రెస్​లోకి రావాలని ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హైదరాబాద్​లోని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు ముగ్గురూ కలిసి చర్చించినట్టు సమాచారం. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా వారిద్దరూ ఆహ్వానించినట్టు తెలిసింది. ఇటీవలి కాలంలో బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. 

దానికి తోడు పీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డితో పాటు హైకమాండ్ కూడా.. పార్టీ వీడినోళ్లకు ఘర్ వాపసీ ఆఫర్ చేసింది. పార్టీ మారినోళ్లు మళ్లీ పార్టీలోకి రావాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి మనసును మార్చేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు రాయబారం చేశారన్న చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ లోకి వస్తే భవిష్యత్ బాగుంటుందని ఆయనకు వాళ్లిద్దరూ చెప్పినట్టు తెలిసింది. అయితే, రాజగోపాల్ రెడ్డి మాత్రం ఏ నిర్ణయాన్ని వెల్లడించలేదని సమాచారం.