కేసీఆర్ను గద్దె దించేందుకే కాంగ్రెస్లో చేరుతున్నా

కేసీఆర్ను గద్దె దించేందుకే కాంగ్రెస్లో చేరుతున్నా

జులై 2న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో AICC కార్యలయంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలిసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని ప్రజలు కేసీఆర్‌ను గెలిపించారని, కానీ, ప్రజల ఆకాంక్షలను ఆయన నెరవేర్చలేదని పొంగులేటి విమర్శించారు. నీళ్లు,నిధులు, నియామకల కోసం సాధించుకున్న తెలంగాణలో అదేమీ జరగడం లేదని చెప్పారు.

తెలంగాణ బిడ్డలు కోరుకున్నది ఇంకా దక్కలేదని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పదవులు ఒక్కటే ముఖ్యం కాదన్నారు. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారని..పదవులకంటే ఆత్మాభిమానం ముఖ్యమన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం దక్కలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ వి  ఆచరణకు సాధ్యం కాని హామీలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మాయమాటలు చెప్పడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు...ఆ విధంగా మాయమాటలు చెప్పలేకే గతంలో కాంగ్రెస్ ఓటమి పాలైందని పొంగులేటి అభిప్రాయపడ్డారు. ఎన్నికలు వచ్చాయంటే కేసీఆర్ కొత్త స్కీములు తెరపైకి తెస్తారని, మూడోసారి కూడా గారడీ మాటలతో సీఎం కావాలని కేసీఆర్ అనుకుంటున్నారని విమర్శించారు.

జులై 2న  కనీవినీ ఎరుగని రీతిలో ఖమ్మంలో మహాసభ ద్వారా పార్టీలో చేరుతామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభను మించిన స్థాయిలో ఈ సభ ఉంటుందని పొంగులేటి తెలిపారు. ఖమ్మం భారీ సభలో కేసీఆర్ డ్రామాలు, డ్యాన్సులు అన్నీ బయటపెడతాం అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.