- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కల్లూరు, వెలుగు : కల్లూరులో గులాబీ పార్టీ గూండాయిజం సాగనివ్వబోమని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో సాగిన చందాలు, దందాల రాజకీయాలకు ఇక స్థానం లేదని స్పష్టం చేశారు. విపక్ష నాయకులు, వారి తొత్తులు అహంకారంతో మాట్లాడుతున్నారని, వారి అహంకారాన్ని అణిచివేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. బుధవారం కల్లూరు మున్సిపాలిటీలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 20కి 20 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి బీఆర్ఎస్కు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. నాయకులు రానక్కర్లేదని, ప్రజలే ఒక విప్లవంలా కదిలి హస్తం గుర్తుకు ఓటు వేసి విపక్షాల అడ్రస్ గల్లంతు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
‘ఇది నా గడ్డ.. నా ఊరు.. ఇక్కడ పుట్టి పెరిగిన వాడిగా చెప్తున్నా.. అభివృద్ధి చేసే సత్తా నాకుంది. చేతకాని వారు పగటి కలలు కంటున్నారు’ అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని అసమర్థులు.. ఇప్పుడు రంగురంగుల కండువాలు వేసుకుని మాయమాటలతో వస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఒక వ్యక్తిని నమ్మి గెలిపించుకుంటే.. పాముకు పాలు పోసినట్లు అయ్యిందని, ఆ పాము ఇప్పుడు విషం కక్కుతోందని బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. వార్డుల్లోకి వస్తున్న బీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు సూచించారు.
‘మీ దగ్గర ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు, నిధులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి లేడు. మరి ఏముందని ప్రగల్భాలు పలుకుతున్నారు..? ఎలా అభివృద్ధి చేస్తారో ప్రజలకు చెప్పాలని ప్రతిపక్ష నాయకులను డిమాండ్‌చేశారు. మభ్యపెట్టే మాటలు, సొల్లు పురాణాలు చెప్పి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ప్రచారంలో ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, రాష్ట్ర నేత మట్టా దయానంద్, కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
