నా టార్గెట్ బీఆర్ఎస్.. వడ్డీతో సహా ఇచ్చి పడేస్తా : పొంగులేటి

నా టార్గెట్ బీఆర్ఎస్.. వడ్డీతో సహా ఇచ్చి పడేస్తా : పొంగులేటి

ఖమ్మంలో తన అనుచరులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి. నా టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అని ఓపెన్ గా చెబుతూ.. వడ్డీతో సహా కేసీఆర్ కు ఇచ్చి పడేస్తా అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారాయన. జూన్ 9వ తేదీ ఖమ్మం సిటీలో తన అనుచరులతో భవిష్యత్ రాజకీయాలపై మాట్లాడారు. 

రెండు మూడు రోజుల్లోనే చేరబోయే పార్టీపై క్లారిటీ.. 

త్వరలో ఏ పార్టీలో చేరేది చెబుతానని.. దీనికి ఎంతో సమయం తీసుకోనని.. రెండు, మూడు రోజుల్లోనే క్లారిటీ ఇస్తానంటూ స్పష్టం చేశారు పొంగులేటి. హైదరాబాద్ వేదికగా పార్టీ మార్పు అంశాన్ని ప్రకటిస్తానని వెల్లడించారాయన.  బీఆర్ఎస్ నేతలు అధికార మదంతో అవాకులు చెవాకులు పేలుతునారని.. వాళ్ల గర్వం అణిచే రోజు త్వరలోనే వస్తుందన్నారాయన.

ఏ పార్టీలో చేరాలనేదానిపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వేలాది మంది అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు.  చేరబోయే పార్టీ పేరు ప్రకటించిన తరువాత ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. జాతీయ పార్టీ పెట్టుకున్నం అని డబ్బాలు కొట్టుకున్న నేతలకంటే తాను నిర్వహించబోయే బహిరంగ సభ గొప్పగా ఉంటుందన్నారు. 

మీ నాయకుడికి జెండా లేదూ.. ఎజెండా లేదు అని ఎగతాళి చేస్తున్నారని.. మీ సొల్లు కబుర్లు, సొంత డబ్బాలకు ఇక్కడ ఎవరూ మీ ట్రాప్ లో పడరంటూ.. బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారాయన. నేను ఒక పార్టీలోకి వెళ్తున్నాను అని మీడియాలో చెప్పగానే.. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు మందు పార్టీలు చేసుకున్నారన్నారు. కానీ మారిన తన వ్యూహంతో బీఆర్​ఎస్​ నేతలకు నిద్ర పట్టడం లేదని కాంగ్రెస్​లో చేరబోతున్నట్లు పరోక్షంగా హింట్​ ఇచ్చారు. కొంత మంది కళ్లు ఉన్నా కనబడని ధృతరాష్ట్ర పాలకులుగా ఉన్నారన్నారు.

మంత్రి పువ్వాడపై గరం..

ఎన్టీఆర్ విగ్రహానికి తాను పూలమాల వేస్తే.. పాలతో శుద్ధి చేయిస్తావా ఇదెక్కడి సంస్కృతి అని మంత్రి పువ్వాడ అజయ్​పై పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులకు బుద్ధి చెప్పబోతున్నారని వ్యాఖ్యానించారు. తనకు పదవి కంటే ప్రజా సేవ ముఖ్యమని పేర్కొన్నారు. మీ ధైర్యమే నన్ను నడిపిస్తోందని తన అనుచరులనుద్దేశించి ఆయన అన్నారు.